Begin typing your search above and press return to search.

పెహల్గాం అటాక్స్.. లష్కరే+పాక్ ఆర్మీ+ ఐఎస్ఐ.. తేల్చిన ఎన్ఐఏ

పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ భయంకర దాడికి లష్కరే తోయిబానే కారణమని అందరూ భావించారు.

By:  Tupaki Desk   |   2 May 2025 11:00 PM IST
పెహల్గాం అటాక్స్.. లష్కరే+పాక్ ఆర్మీ+ ఐఎస్ఐ.. తేల్చిన ఎన్ఐఏ
X

కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్ర దాడికి పథకం ఎవరిది...? దానికి వ్యూహ రచన ఎక్కడ జరిగింది..? దాడిలో పాల్గొన్నది ఎవరు..? సహకరించింది ఎవరు? అనే వివరాలు బట్టబయలయ్యాయి.. దీనికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక అప్ డేట్ సాధించింది.

పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ భయంకర దాడికి లష్కరే తోయిబానే కారణమని అందరూ భావించారు. దీనికి అనుబంధమైన రెసిస్టెన్స్ ఫ్రంట్ తమదే బాధ్యతని కూడా ప్రకటించింది. ఇప్పుడు బైసరన్‌ లోయలో పర్యాటకులపై దాడి ఆలోచన లష్కరేదేనని ఎన్ఐఏ ప్రాథమికంగా నిర్ధారించింది. పాక్‌ లోని లష్కరే ప్రధాన కార్యాలయంలో తుదిరూపు వచ్చింది. వీరిద్దరూ పాక్‌ జాతీయులే.

మరోవైపు లష్కరేతో పాటు పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం కూడా ఉందని ఎన్ఐఏ తేల్చింది. లష్కరే హెడ్ క్వార్టర్స్ లో జరిగిన సమావేశంలో దాడి ప్రణాళిక సిద్ధమైందని, ఐఎస్ఐ సీనియర్ అధికారులు సూచనల మేరకు వ్యూహం అమలు చేశారని చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి హష్మీ మూసా, అలీ వచ్చారని.. పాక్ హ్యాండ్లర్లతో నిత్యం టచ్ లో ఉన్న వీరు.. స్థానిక ఉగ్రవాదుల సాయంతో దాడికి దిగినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

మరోవైపు పెహల్గాం దాడికి భారత్ నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. దీనికోసం భారత్ వేదిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. కాగా, ఉగ్రదాడి తర్వాత కశ్మీర్‌లో భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి.