బయలుదేరిన పాక్ విమానాలు.. బోర్డర్ నుంచి కీలక పోస్టులు!
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 1:45 PM ISTజమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాతపాటే పాడింది! మరోపక్క ఆ దేశ మిలటరీ అప్రమత్తమవ్వడంతో సరిహద్దుల్లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి!
అవును... జమ్ముకశ్మీర్ లోని పహల్గాం లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పాక్.. ఆ దాడి అనంతరం తమ మిలటరీని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయల్దేరినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ మేరకు ఎక్స్ లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లు షేర్ అవుతున్నాయి. వీటి ప్రకారం.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు.. కరాచీలోని సౌత్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపుగా లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా బయలుదేరుతున్నాయి. వాస్తవానికి ఇండియన్ బోర్డర్ సమీపంలో పాక్ కు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్ ఉంది.
ఈ సమయంలో రెండు విమానాలు అటు వైపు బయలుదేరినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఒక రవాణా విమానంతో పాటు నిఘా కార్యకలాపాలు, వీఐపీలను తరలించేందుకు వాడే మరో విమానం ఆ పోస్టుల్లో కనిపిస్తున్నాయి!
గతానుభవాలతో అప్రమత్తం!:
వాస్తవానికి ఇటీవల కాలంలో ఉగ్రదాడులు అనగానే పుల్వామా ఘట్న గుర్తుకురాకమానదనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2019లో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఏకంగా 40 మంది సైనికులు అమరులయ్యారు. అయితే.. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. బాల్ కోట్ లోని జైషే మహ్మద్ గ్రూప్ ట్రైనింగ్ సెంటర్స్ పై వైమానిక దాడులు నిర్వహించింది.
దీంతో.. ఉగ్రమూకలకు అది తేరుకోలేని దెబ్బగా చెబుతారు! ఇలాంటి గతానుభవాలను దృష్టిలో ఉంచుకున్న పాక్ తాజా ఉగ్రదాడి ఘటన అనంతరం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బోర్డర్ వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ పరిణామాలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు!
