'పందికి లిప్ స్టిక్ పెట్టొచ్చు కానీ'... పాక్ పై యూఎస్ మాజీ ఆఫీసర్ ఫైర్!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 10:12 AM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. భారత్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో యూఎస్ మాజీ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కరుడుగట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు.
మిస్టర్ రూబిన్ మాట్లాడుతూ... బిన్ లాడెన్, మునీర్ మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే... మునీర్ ఒక రాజభవనంలో నివసిస్తుంటే, బిన్ లాడెన్ కలుగులో నివసించాడని అన్నారు. ఈ సందర్భంగా పహల్గాం దాడికి అమెరికా తీసుకోవాల్సిన ఏకైక ప్రతిచర్య ఏమిటంటే.. అసిం మునీర్ ను ఉగ్రవాదిగా అధికారికగా ప్రకటించడమే అని అన్నారు.
ఇదే సమయంలో పాకిస్థాన్ ను ఉగ్రవాద మద్దతుదారుగానూ ప్రకటించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా... పందికి లిప్ స్టిక్ అయినా పెట్టొచ్చు కానీ.. అనే వాక్చాతుర్యాన్ని ఉపయోగించిన ఆయన.. పాక్ వైఖరి మాత్రం ఎప్పటికీ మారదని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బిల్ క్లింటన్ పర్యటనను గుర్తు చేసుకున్నారు.
ఇందులో భాగంగా... నాడు బిల్ క్లింటన్ భారత్ వచ్చినప్పుడు ఉగ్రదాడి జరిగినట్లే.. నేడు జేడీ వాన్స్ భారత పర్యటన దృష్టిని మళ్లించాలని పాక్ కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.
కాగా... 2019లో పుల్వామాలో దాడి జరిగిన సమయంలో పాక్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ. అధిపతిగా అసీం మునీర్ ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఆ మునీరే ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ కావడంతో.. భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోపక్క.. ఇటీవల అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పై అతడు చేసిన ప్రసంగమే ఈ దాడికి పురిగిల్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా అమెరికా ప్రకటించాలని.. మిస్టర్ రూబిన్ అభిప్రాయపడ్డారు.