పాక్ గగనతలంలోకి ప్రవేశించని మోడీ... అనుమతి తిరస్కరణ!
జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు.
By: Tupaki Desk | 23 April 2025 5:14 AMజమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 28 మంది మృతి చెందగా.. దాదాపు 20 మంది వరకూ గాయపడి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సౌదీ అరేబియా పర్యటనను కుదించుకున్నారు మోడీ.
పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఈ సమయంలో బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయన.. విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిస్త్రీతో లు ఈ పాల్గొనగా.. దాడి జరిగిన తీరును వారు ప్రధాని మోడీకి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని తిరుగు ప్రయాణానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... భారత్ నుంచి సౌదీ అరేబియా నగరం జెడ్డాకు వెళ్లేటప్పుడు మోడీ విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగానే వెళ్లింది. అయితే... తాజా ఉగ్రదాడి నేపథ్యంలో.. జెడ్డా నుంచి తిరిగి వస్తోన్న సమయంలో ప్రధాని మోడీ ప్రయాణించిన ప్రత్యేక విమానం పాక్ గగనతలంలోకి ప్రవేశించలేదు.
వాస్తవానికి తమ గగనతలాన్ని వినియోగించుకోవడానికి పాకిస్థాన్ అనుమతి ఇచ్చినప్పటికీ.. భారత్ దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో.. తిరిగి వస్తోన్న సమయంలో రెగ్యులర్ ఫ్లైట్ పాత్ కు భిన్నంగా ప్రయాణించి హస్తినకు చేరుకొంది. పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో ఆ దేశ గగనతలం మీదుగా భారత్ చేరుకోవడానికి ప్రధాని ఇష్టపడలేదని తెలుస్తోంది.
కాగా... 2019 ఫిబ్రవరి 26 తర్వాత తమ గగనతలంపై నుంచి భారతీయ విమానాల రాకపోకలపై పాకిస్థాన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పట్లో మోడీ జర్మనీ పర్యటన సందర్భంగా ఈ గగనతలాన్ని వాడుకోవడానికి భారత్ నుంచి అభ్యర్థన వెళ్లినా పాక్ ఒప్పుకోలేదని అంటారు.
దీంతో అప్పటి నుంచి మోడీ.. పాక్ గగనతలంపై ప్రయాణించడం లేదు. అయితే 2024 ఆగస్టు 27న భారత ప్రధాని నంద్రమోడీ తన పోలాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చే క్రమంలో పాకిస్థాన్ మీదుగా చేరుకున్నారు. ఆ సమయంలో.. ఇస్లామాబాద్, లాహోర్ పై నుంచి ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే.. తాజాగా జెడ్డా నుంచి వస్తోన్న ప్రధాని మోడీకి పాకిస్థాన్ తమ గగనతలంలో ప్రయాణించడానికి అనుమతిచ్చినా.. ఆ అనుమతిని భారత్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.