క్వారీ యజమాని సతీమణి ఫిర్యాదుతో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఒక క్వారీ యజమాని సతీమణి ఇచ్చిన ఫిర్యాదు కారణంగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 21 Jun 2025 4:05 AMశంషాబాద్ ఎయిర్ పోర్టులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఒక క్వారీ యజమాని సతీమణి ఇచ్చిన ఫిర్యాదు కారణంగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణ ఆయనపై ఉంది. నిజానికి ఈ ఫిర్యాదుపై తనను అరెస్టు చేయొద్దంటూ కొద్ది రోజుల క్రితం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కట్ చేస్తే.. శనివారం తెల్లవారుజామున ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవటం.. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వరంగల్ కు తరలించారు.
ఇంతకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు ఏమిటి? ఆయనపై చేసిన ఫిర్యాదు.. అరెస్టుకు దారి తీసిన కారణాల్లోకి వెళితే.. కమలాపురం మండలం వంగపల్లిలో మనోజ్ అనే వ్యక్తి క్వారీ నిర్వహిస్తూ ఉంటారు. ఆయన సతీమణి ఉమాదేవి వరంగల్ పట్టణంలోని సుబేదారీ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాల్ని తెలుసుకున్న కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ ఏప్రిల్ లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఐదు రోజుల క్రితం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తునకు సహకరించాలని పేర్కొంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
నిజానికి ఇదే హైకోర్టు.. కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసుకున్న సమయంలో ఆయన అరెస్టు కాకుండా అడ్డుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. తదనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రం దర్యాప్తునకు సహకరించాలని పేర్కొంటూ కేసును కొట్టేసింది. ఇది జరిగిన ఐదు రోజులకు తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన్ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.