Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్‌కు భ‌లే ఛాన్సిచ్చిన కాంగ్రెస్‌..!

తెలంగాణలో శనివారం ఉదయం చోటు చేసుకున్న పరిణామం సాయంత్రానికి రాజకీయంగా యూటర్న్ తీసుకుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 12:19 PM IST
బీఆర్ ఎస్‌కు భ‌లే ఛాన్సిచ్చిన కాంగ్రెస్‌..!
X

తెలంగాణలో శనివారం ఉదయం చోటు చేసుకున్న పరిణామం సాయంత్రానికి రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ లో శనివారం ఉదయం హడావుడిగా వ‌రంగ‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ క్వారీ యజమానిని బెదిరించి 50 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారనేది ఈ కేసు. ఇది నమోదై చాలా రోజులే అయింది. దీనిని కొట్టివేయాలని కోరుతూ కౌశిక్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆయనకు ఉపశమనం లభించలేదు.

ఇది జరిగి కూడా రెండు రోజులు అయిన తర్వాత శనివారం ఉదయం హడావుడిగా శంషాబాద్ కు వచ్చిన వరంగల్ జిల్లా సుబేదార్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆ వెంటనే వరంగల్ జిల్లాకు తరలించారు. అనంతరం ఆయనను స్థానిక రైల్వే కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కేసు అనేక మలుపులు తిరిగింది. కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వినిపించిన వాదనలు, పోలీసులు తరపున న్యాయవాది వినిపించిన వాదనలకు మధ్య అనేక తేడాలు గుర్తించిన న్యాయాధికారి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయటం విశేషం.

ప్రధానంగా ఇక్కడ న్యాయాధికారి రెండు మూడు ప్రశ్నలు సంధించారు. 50 లక్షల రూపాయలు అడిగారా లేక బెదిరించారా దీనిపై క్లారిటీ ఏమిటి అని పోలీసులు తరఫున న్యాయవాదిని అడిగినప్పుడు ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఇక రెండోది 50 లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డికి ముట్టాయా అని ప్రశ్నించినప్పుడు కూడా సరైన సమాధానం చెప్పలేదు. అడగడం వేరు బెదిరించడం వేరు అంటూ న్యాయాధికారి వ్యాఖ్యానిస్తూ ఈ కేసులో బలమైన ఆధారాలను సమర్పించేందుకు గడువు ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది వినిపించిన వాదనలు బలంగా ఉండటం రాజకీయ కక్షపూరితంగా వేధిస్తున్నారని రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారని చేసిన వ్యాఖ్యలు బలంగా నమోదయ్యాయి. దీంతో వెంటనే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఇదిలా ఉంటే ఈ పరిణామంతో అధికార కాంగ్రెస్ పార్టీపై బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా విజృంభించారు. రాజకీయ కక్ష సాధింపులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరదీసిందని దీనికి కౌశిక్ రెడ్డి కేసు ఉదాహరణ అని చాలామంది నాయకులు విమర్శలు గుప్పించారు.

అంతేకాదు కౌశిక్ రెడ్డి కేసులో కోర్టు అడిగిన ప్రశ్నలు ప్రభుత్వానికి పోలీసులకు కూడా తగిన గుణపాఠం చెప్పాయని నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ మరింత ముదిరిందనే చెప్పాలి. ఇప్ప‌టికే ఫార్ములా ఈ రేస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల‌పై బీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య పొలిటిక‌ల్ ఫైట్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో దీనికి కౌశిక్ రెడ్డి కేసు కూడా త‌గులుకోవ‌డం గ‌మ‌నార్హం.