Begin typing your search above and press return to search.

ఎల్ నినో గుప్పిట్లో భారతదేశం? అయితే క‌రువు లేక‌పోతే వ‌ర‌ద‌లు!

పసిఫిక్ సముద్రంలో వచ్చే ఈ మార్పులు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరువులకు, మరికొన్ని ప్రాంతాలలో ముంచెత్తే వరదలకు కారణం కానున్నాయి.

By:  Sivaji Kontham   |   10 Jun 2026 10:22 AM IST
ఎల్ నినో గుప్పిట్లో భారతదేశం? అయితే క‌రువు లేక‌పోతే వ‌ర‌ద‌లు!
X

పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత శక్తివంతమైన 'ఎల్ నినో' ప్రక్రియ ప్రారంభమైందని..ఇది రికార్డు స్థాయి తీవ్రతకు చేరుకునే అవకాశం ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ (ECMWF) తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. భూమధ్యరేఖ వెంబడి ఉన్న పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నవంబర్ నాటికి సాధారణం కంటే ఏకంగా 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పరిణామాలలో ఒకటిగా నిలవబోతున్న ఈ మార్పు... ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను అతలాకుతలం చేసే ముప్పును తెచ్చిపెడుతోంది. పసిఫిక్ సముద్రంలో వచ్చే ఈ మార్పులు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరువులకు, మరికొన్ని ప్రాంతాలలో ముంచెత్తే వరదలకు కారణం కానున్నాయి.

భూమధ్యరేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్ నినో. ఈ ఉష్ణోగ్రత మార్పులు సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల వాతావరణాన్ని సైతం శాసిస్తాయి. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు వాతావరణ గాలి ప్రసరణలో భారీ మార్పులు సంభవిస్తాయి. ఇది అంతర్జాతీయంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫానుల గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. గతంలో సంభవించిన బలమైన ఎల్ నినోల వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా.. ఊహించని ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి.

భారతదేశానికి ఎల్ నినో ముప్పు అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం వాటాను అందించే నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి ఎల్ నినో సంవత్సరం కరువుకు దారితీయకపోయినా.. భారతదేశ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు సంవత్సరాలన్నీ బలమైన ఎల్ నినో ప్రభావంతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. పసిఫిక్‌లో పెరుగుతున్న ఈ వేడి 2026 చివరి నాటికి .. 2027 లో దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని భారీగా తగ్గించి.. తీవ్రమైన సాగునీటి, తాగునీటి కొరతకు కారణం కావచ్చు.

వర్షపాతం తగ్గడమే కాకుండా... ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో ఎండ తీవ్రత -ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలు వర్షాలు లేక కరువుతో ఎండిపోతుంటే...వాతావరణ అసమతుల్యత కారణంగా మరికొన్ని ప్రాంతాలు అకస్మాత్తుగా ముంచెత్తే అకాల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయ్యే విచిత్రమైన పరిస్థితులు తలెత్తవచ్చు. అయితే రానున్న‌ నెలల్లో సముద్ర గమనాన్ని బట్టి ఈ కాలానుగుణ అంచనాలలో మార్పులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

పసిఫిక్ మహాసముద్రం వేడెక్కే ఈ ధోరణి ప్రస్తుత మార్గంలోనే కొనసాగితే... భారతదేశ వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లైమేట్ ఏజెన్సీలతో పాటు భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలు కూడా పసిఫిక్ ఉష్ణోగ్రతలను నిరంతరం నిశితంగా గమనిస్తున్నారు. రానున్న‌ కొద్ది నెలల్లో వెలువడే వాతావరణ నివేదికలు ఎల్ నినో క‌చ్చితమైన తీవ్రతను...అది మన రుతుపవనాలపై చూపే స్పష్టమైన ప్రభావాన్ని నిర్ణయించనున్నాయి. హైద‌రాబాద్ స‌హా ప‌లు మెట్రోల్లో భీభ‌త్స‌మైన వ‌ర్షం కుర‌వ‌డం లేదా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ్వ‌డం కూడా ఎల్.నినో ప్ర‌భావంగానే చూడ‌వ‌చ్చు.