Begin typing your search above and press return to search.

పి.గ‌న్న‌వ‌రం.. ఐదో కృష్ణుడు రాకుండా ఉండాలంటే..?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో వరుసగా నాయకులు మారుతూ వస్తున్నారు.

By:  Garuda Media   |   16 April 2026 7:00 AM IST
పి.గ‌న్న‌వ‌రం.. ఐదో కృష్ణుడు రాకుండా ఉండాలంటే..?
X

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో వరుసగా నాయకులు మారుతూ వస్తున్నారు. 2009 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పార్టీ వరుసగా ఇక్కడ విజయం సాధించలేదు. అంతేకాదు ఆయా పార్టీల తరఫున నాయకులు కూడా మారుతూ వచ్చారు. 2009 నుంచి న‌లుగురు నేత‌లు (కృష్ణులు అనే సెటైర్లు ఉన్నాయి) మారారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గిపోయిన క్రమంలో 2014లో ప్రజలు టిడిపి వైపు నిలిచారు.

దీంతో 2014లో పులపర్తి నారాయణమూర్తి టిడిపి తరఫున విజయం సాధించారు. ఇక 2019 వచ్చేసరికి వైసిపి గెలుపు గుర్రం ఎక్కింది. ఈ పార్టీ తరఫున కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. 2024 ఎన్నికల సమయంలో అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి. కూటమి పొత్తులో భాగంగా ఈ టికెట్ను జనసేన దక్కించుకుంది. ఆ పార్టీ తరఫున గిడ్డి సత్యనారాయణ పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. ఇంతవరకు బాగానే ఉంది మరి వచ్చే ఎన్నికల సంగతి ఏంటి..ఆ సమయానికి ఈక్వేషన్లు మారుతాయా అనేది ఆసక్తిగా మారింది.

ఎందుకంటే ఏ ఎన్నిక‌లోనూ ఒక అభ్యర్థిని స్థిరంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకోకపోవడమే దీనికి కారణం. అయితే దీనికి కూడా ప‌లు అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి అన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. నాయకులు నియోజకవర్గ అభివృద్ధి పైన, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలోని ప్రాంతాలను డెవలప్ చేసే విషయంలో చేస్తున్న ఉదాశీన‌త ఇక్కడ ప్రజల్లో కలవరం రేపుతోంది. దీంతో ఎప్పటికప్పుడు నాయకులను మారుస్తున్నారు.

ఈ పరిణామాల క్రమంలో వచ్చే ఎన్నికల్లో వరుస విజయం సాధించాలని గనక భావిస్తే, ఐదో కృష్ణుడు అవ‌స‌రం ఉండ‌కుండా చూడాల‌ని అనుకుంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అయినా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజలను తన వైపు తిప్పుకునే దిశగా సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. అలా కాకుండా అందరిలాగా తాను కూడా ఉంటాను అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ ప్రజల మూడ్ మారిపోవచ్చు.

ఫలితంగా ఆశించిన ఫలితం దక్కకపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. గతంలో ఇదే జరిగింది. వరుసగా జరిగిన నాలుగు ఎన్నికల్లోను అభ్యర్థులు మార్చడం వెనుక స్థానిక సమస్యలను పరిష్కరించకపోవడం ప్రజలకు చేరువ కాకపోవడం తో పాటు కీలకమైన అభివృద్ధి పనులను పెండింగ్లో ఉంచడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరి ఎప్పటికైనా గడ్డి సత్యనారాయణ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన అడుగులు వేస్తారో లేదో చూడాలి.