నొప్పింపక.. తానొవ్వక.. 'బనకచర్ల'పై.. బాబు స్ట్రాటజీ!
ఇతమిత్థంగా ఏడాది కిందట సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన కీలకమైన ఎత్తిపోతల పథకం బనకచర్ల పై వచ్చిన అభ్యంతరాలు ఇవీ.
By: Garuda Media | 8 Nov 2025 5:30 PM IST+ బనకచర్ల ప్రాజెక్టుకు మేం ఒప్పుకోం: తెలంగాణ ప్రభుత్వం నుంచి హెచ్చరికలు.
+ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే.. మాకు గోదావరిలో నీటి వాటా పెంచాల్సిందే: కర్ణాటక ఘీంకరింపులు.
+ ఆ రెండు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. మీరు మరోసారి పరిశీలించాలి: కేంద్రం నుంచి బనకచర్లపై సూచనలు సలహాలు.
- ఇతమిత్థంగా ఏడాది కిందట సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన కీలకమైన ఎత్తిపోతల పథకం బనకచర్ల పై వచ్చిన అభ్యంతరాలు ఇవీ. అయినా.. దీనిని సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. చివరి నిముషం వరకు ఆయన ప్రయత్నం లోపం లేకుండానే ముందుకు సాగారు. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు సహా.. సీమలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. మొత్తం 80 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాధమికంగా నిర్ధారించారు.
ఇక, ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను.. పోలవరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లి.. అక్కడ నుంచి ఎత్తిపోసి.. కర్నూలుకు తరలించాలి. ఈ ప్రాజెక్టును ఏపీకి గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్న చంద్రబాబు.. కేంద్రాన్ని కూడా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను రెడీ చేసేందుకు టెండర్లు కూడా పిలిచారు. కానీ.. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ఎవరినీ నొప్పించకుండా.. తాను కూడా ఇబ్బంది పడకుండా.. ఇప్పుడు కొత్త వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు సీఎం చంద్రబాబు.
అదే.. పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు. దీనిని చేపడితే.. ఏ రాష్ట్రానికీ అభ్యంతరం ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇక, దీనికి 30 వేల కోట్ల వరకు ఖర్చు తగ్గనుంది. అదేవిధంగా అనుకున్న ప్రయోజనం కూడా నెరవేరుతుంది. ఇక, ఈ ప్రాజెక్టు ద్వారా.. బొల్లాపల్లి జలాశయానికి గోదావరి జలాలు తరలించి.. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయానికి తీసుకువెళ్తారు. ముందు దీనిని పూర్తి చేస్తారు. అనంతరం.. అక్కడ నుంచి బనకచర్లకు తరలిస్తారు.
