Begin typing your search above and press return to search.

మజ్లిస్ ఎంట్రీ : వైసీపీకి లాభమా కూటమికి మేలా ?

మజ్లిస్ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాలని చూస్తోంది. చాలా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది. అంతే కాదు ఎన్నో కొన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:28 PM IST
మజ్లిస్ ఎంట్రీ : వైసీపీకి లాభమా కూటమికి మేలా ?
X

మజ్లిస్ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాలని చూస్తోంది. చాలా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది. అంతే కాదు ఎన్నో కొన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటోంది. అయితే రెండో ఎంపీని మాత్రం సంపాదించుకోలేకపోతోంది. ఏమైతేనేమి జాతీయ స్థాయిలో మజ్లిస్ పాత్ర కీలకంగానే ఉంది.

మజ్లిస్ కి అఖిల పక్ష సమావేశాలలోనే కాదు ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదం మీద ప్రపంచ దేశాలకు వివరించేందుకు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంపించిన ఏడు అఖిల పక్ష కమిటీలలో ఒకదానిలో అసదుద్దీన్ కి చోటు కల్పించారు. అలా ఆయన మాటలు సలహాలూ సూచనలు ఎన్డీయే ప్రభుత్వం పాటిస్తోంది.

మజ్లిస్ ఎంపీగా ఒక్కరుగా ఉన్నా అసదుద్దీన్ ప్రతీ అంశంలో తనదైన వాదనను వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఒక చూస్తే ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని మజ్లిస్ చాలా కాలంగా చూస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా మజ్లిస్ పోటీ చేసినా పూర్తి స్థాయిలో బరిలోకి దిగలేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ చూస్తోంది.

తాజాగా కర్నూల్ లో ముస్లిం మైనార్టీలతో అసదుద్దీన్ భారీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి వేలాదిగా జనాలు వచ్చారు. వక్ఫ్ బిల్లు మీద ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీశారు. చంద్రబాబు ఎన్డీయే భాగస్వామిగా ఉంటూ ఆరెస్సెస్ అజెండాకు తల ఒగ్గుతున్నారని ఘాటైన విమర్శలను చేశారు అసదుద్దీన్

మరో వైపు చూస్తే రాజ్యాంగం మైనారిటీలకు అందించిన హక్కులను ఎన్డీయే కాలరాస్తోందని అన్నారు. ఈ విధంగా ఆయన చంద్రబాబు మీద ధాటీగా విమర్శలు చేయడం ఇపుడు చర్చనీయాంశం అయింది. వక్ఫ్ బిల్లు సవరణలు కొన్ని నెలల క్రిందట పార్లమెంట్ లో ఆమోదం పొందాయి. అయితే దాని మీద ఏపీలో కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయి.టీడీపీ మద్దతు ఇచ్చిందని వైసీపీ పెద్దగా విమర్శించినది లేదు.

వైసీపీ కూడా ఎందుకో ఈ విషయంలో కూటమి మీద విమర్శలు చేయడానికి వచ్చిన అవకాశాన్ని పెద్దగా వాడుకోవడలేదు. బీజేపీకి బాహాటంగా చెడ్డ కావడం ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. అయితే వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసింది. దానిని కూడా మైనారిటీలలో ప్రచారం చేసుకోలేకపోతోంది.

ఈ నేపధ్యంలో ఆ వర్గంలో ఏపీలోని రాజకీయ పార్టీల పట్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఎవరికీ పెద్దగా తెలియదు. కూటమికి 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీలు మద్దతు ఇచ్చారు. ఇక వక్ఫ్ బిల్లు తరువాత వారిలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నది చూడాలి. అయితే వారు వైసీపీ వైపుగా మొగ్గు చూపుతారా అంటే అది కూడా పెద్దగా జరిగే చాన్స్ ఉందా అన్నది ప్రశ్నార్ధకమే అని అంటున్నారు.

దానికి కారణం గట్టిగా వారి వైపు నిలిచి వైసీపీ బాహాటంగా మాట్లాడకపోవడమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మజ్లీస్ రంగ ప్రవేశం చేయడం వక్ఫ్ బిల్లు మీదనే మైనారిటీల మద్దతుని కూడగట్టం ద్వారా ఏపీలో బలమైన రాజకీయ పునాదులు వేసుకోవడానికి చూస్తోందా అన్న చర్చ మొదలైంది.

ఏపీలో కనీసంగా ఇరవై నియోజకవర్గాల ద్వారా మైనారిటీల మద్దతు మీద నిలిచి గెలిచేవి ఉన్నాయి. వీటిలో కొన్నింటి మీద అయినా మజ్లిస్ పట్టు సాధిస్తే ఏపీలో ఆ పార్టీ అరంగేట్రానికి ఒక రెడ్ కార్పెట్ పరచినట్లు అవుతుంది. అయితే మజ్లీస్ రాక వల్ల ఏ పార్టీకి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది.

వైసీపీకి సహజంగా మైనారిటీలు ఓటు బ్యాంక్ . పోటీగా ఏ పార్టీ వచ్చినా ఆ మేరకు వైసీపీ ఓట్లకే గండి పడుతుందని అంటున్నారు. మరో వైపు కూటమి అధికారంలో ఉంది. ప్రతిపక్షంగా ఎన్ని పార్టీలు వచ్చి వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటే ఆ మేరకు అంత లాభం కూటమికే అన్న విశ్లేషణ ఉంది. మొత్తం మీద మజ్లీస్ కర్నూల్ మీటింగ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. అదే సమయంలో రాజకీయంగా అనేక రకాలైన విశ్లేషణలకు అవకాశం ఇచ్చింది అని అంటున్నారు.