హాట్ టాపిక్: మోడీకి అసదుద్దీన్ మూడు ప్రశ్నలు, ఒక సూచన!
అవును... భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటి నుంచీ.. అందుకు గల కారణాలు, ఒప్పందాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 2:09 PM ISTభారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు శనివారం సాయంత్రంతో 5 గంటల తరువాత అధికారికంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం జరిగిన అనంతరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇది భారత్ చేసిన వ్యూహాత్మక తప్పిందం అని ఒకరంటే.. ఇలాంటి నిర్ణయాల వల్లే చరిత్ర పునరావృతం అవుతుందని మరొకరు అంటున్నారు.
ఇదే సమయంలో.. అసలు ఈ విషయాన్ని మరో దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ఏమిటని మరికొందరు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని... భారత్ పై తాము సాధించిన విజయం అని పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను చాలా మంది జీర్ణించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో ఒవైసీ స్పందించారు.
అవును... భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటి నుంచీ.. అందుకు గల కారణాలు, ఒప్పందాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా, లేకపోయినా ఉగ్రవాదులను విడిచి పెట్టొద్దని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రవాదులకు శిక్ష పడాల్సిందేనన్నారు.
బయట శక్తులు ఎప్పుడు దేశంలోకి ప్రవేశించినా భారత ప్రభుత్వానికి, ఆర్మీకి మద్దతుగా ఉంటానని అన్నారు. యుద్ధ సమయంలో ఆర్మీ చూపించిన తెగువకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో.. యుద్ధ సమయంలో మరణించిన సైనికుడు మురళీ నాయక్, ఏడీడీసీ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.
ఈ కాల్పుల విరమణ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పిన అసదుద్దీన్... గత రెండు వారాలుగా జరిగిన విషయాలపై భారతీయులు, భారత రాజకీయ పార్టీలు కొన్ని పాఠాలు నేర్చుకుంటాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతా ఐక్యంగా ఉంటే భారత్ బలంగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా తనవద్ద నాలుగు సందేహాలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటిని నివృత్తి చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
1. "ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు... కాల్పుల విరమణ గురించి ప్రకటించాల్సింది ఆయనే.. పరాయి దేశ అధ్యక్షుడు కాదు! సిమ్లా ఒప్పందం (1972) నుంచి మనం మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము.. అలాంటప్పుడు దీన్ని మనం ఎందుకు అంగీకరించాము?”
“అసలు కాశ్మీర్ సమస్య అంతర్జాతీయ వేదిక వరకూ వెళ్లదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది మన అంతర్గత విషయం!"
2. "మనం మూడో స్థానంలో చర్చలు జరపడానికి ఎందుకు అంగీకరించాము? ఈ కాల్పుల విరమణ వెనకున్న ఎజెండా ఏమిటి? పాకిస్థాన్ ఇకపై తన గడ్డను ఉగ్రవాదానికి ఉపయోగించదని అమెరికా ఏమైనా హామీ ఇస్తుందా?"
3. "భవిష్యత్తులో ఉగ్రవాద దాడుల నుంచి పాకిస్థాన్ ను నిరోధించాలనే లక్ష్యాన్ని మనం సాధించామా? ట్రంప్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ తీసుకురావడమా.. లేక, పాకిస్థాన్ ను మరో దాడి గురించి కలలో కూడా ఊహించలేని స్థితిలో ఉంచడమా.. మన లక్ష్యం ఏమిటి?"
4. “పాకిస్థాన్ ను “ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్.ఏ.టీ.ఏ)” గ్రే లిస్ట్ లో ఉంచడానికి అంతర్జాతీయ ప్రచారాన్ని మనం కొనసాగించాలి!
