సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు: ఎంఐఎం
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు.. దేశ సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
By: Garuda Media | 16 April 2026 3:40 PM ISTకేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు.. దేశ సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై ఆయన లోక్‌సభలో స్పందిస్తూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గాల పునర్విభజన కు కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తాము తీవ్రంగా తప్పుబడుతున్నామన్నారు.
ఒక ప్రాతిపదిక లేకుండా.. నియోజకవర్గాలను అత్యంత అవసరంగా విభజన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన చేపట్టాల్సిన బిల్లును.. ఇంకా జనాభా లెక్కలు కూడా ప్రారంభం కాకుండానే చేపట్టడాన్ని తప్పుబట్టారు. ఇది రాజ్యాంగాన్ని విఘాతం చేయడమేనని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ తన సీట్లను పెంచుకునే కుటిల వ్యూహంగా ఆయన పేర్కొన్నారు.
ఈ బిల్లు ద్వారా రాష్ట్రాల పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని ఎంఐఎం అధినేత వ్యాఖ్యానించారు. అయితే.. అసదుద్దీన్ మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రులు పదే పదే తమ వివరణ ఇచ్చారు. ఈ విషయంపై అసదుద్దీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనలో అంతరం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనిని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు.
ఆందోళన..
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు.. నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు ఒక్కసారిగా తమ తమ స్థానాల్లో లేచి నిలబడి.. నిరసన వ్యక్తం చేశారు. కొందరు స్పీకర్ పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఓటింగ్..
ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ పక్షం.. ఈ బిల్లుపై అసలు చర్చ చేపట్టాలో వద్దో ఓటింగ్ చేపట్టాలని స్పీకర్‌కు విన్నవించింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. దీనిలో బిల్లుపై చర్చ కోరుతూ.. 207 మంది సభ్యులు, వద్దని 126 మంది సభ్యులు మొత్తంగా 333 మంది(సభకు హాజరైన వారు) ఓటింగ్ వేశారు. దీంతో బిల్లుపై చర్చ చేపడుతున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో బిల్లును వ్యతిరేకించిన పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
