Begin typing your search above and press return to search.

ఔటర్ పై స్లోగా వెళ్లినా ఫైనే.. ఎందుకంటే?

హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉండే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కీలక అంశాల్ని సైబరాబాద్ పోలీసు కమిషన్ తాజాగా కీలక అంశాల్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:48 AM GMT
ఔటర్ పై స్లోగా వెళ్లినా ఫైనే.. ఎందుకంటే?
X

హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉండే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కీలక అంశాల్ని సైబరాబాద్ పోలీసు కమిషన్ తాజాగా కీలక అంశాల్ని వెల్లడించారు. ఈ మధ్యనే ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే వారి వాహనాలు గరిష్ఠంగా 100 కి.మీ. నుంచి 120 కి.మీ.లకు పెంచటం తెలిసిందే.

అయితే.. ఈ మార్పునకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎలా అయితే.. చాలా ఆఫర్లకు పైన చుక్క ఉండి.. కండీషన్స్ అప్లై అన్న లింకు ఉంటుందో.. సరిగ్గా అదే మాదిరి ఔటర్ మీద వెళ్లే వాహనాల కు సంబంధించిన పరిమితులు ఉన్నాయి.

అందులో ముఖ్యమైనది ఔటర్ రింగ్ రోడ్డులోని లైన్ 1, 2 మీద ప్రయాణించే వాహనాలు మాత్రమే గరిష్ఠంగా గంట కు 120కి.మీ. వేగంగా ప్రయాణించే వీలుంది. అదే సమయంలో 3, 4 లైన్ల మీద ప్రయాణించే వారు గంట కు 80కి.మీ. మించి ప్రయాణించే వీల్లేదు.

అంతేకాదు.. గంటకు 40కి.మీ. కంటే తక్కువ స్పీడ్ తో వెళ్లే వారు ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళితే.. ఆయా వాహనాల కు ఫైన్ వేస్తామని పోలీసులు స్పస్టం చేస్తున్నారు. అంటే.. ఔటర్ రింగు రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు మోతాదుకు మించిన వేగంగా దూసుకెళుతున్నా.. చెప్పిన దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణించినా సదరు వాహనాల కు ఫైన్ వేస్తామని చెబుతున్నారు. జులై 28 నుంచి తాజా నిబంధనలు అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు.

అమితమైన వేగం (గంటకు 120కి.మీ. దాటకూడదు)తో వెళ్లే వాహనాలు 1,2 లైన్లలో ప్రయాణించాలి.. తక్కువ వేగం (గంటకు 40కి.మీ. కంటే ఎక్కువ) తో ప్రయాణించే వాహనాలు 3, 4 లైన్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. భారీ వాహనాలు 3, 4 లైన్లలోనే ప్రయాణించాలి.

నిర్దేశించిన వేగ పరిమితి ప్రకారం వాహనాలు లైన్లు మారాలనుకుంటే వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందు నుంచే ఇండికేటర్లు వేసుకొని మాత్రమే లైన్లు మారాలి. లైన్లను మారే విషయంలో క్రమపద్దతి కాకుండా జిగ్ జాగ్ గా జర్నీ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే.. వారి పై జరిమానా విధిస్తారు. సో.. ఔటర్ మీద వాహనం లో వెళుతున్నారా? జర.. కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయటం మర్చిపోవద్దు.