Begin typing your search above and press return to search.

గాల్లో పుస్తకాలు.. ఎక్కడి నుంచి వస్తు్న్నాయని ఆశ్చర్యపోయిన వాహనదారులు

ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో సామూహిక నకలు ఉదంతం మరోసారి బయటపడింది.

By:  Tupaki Desk   |   29 Nov 2025 5:59 PM IST
గాల్లో పుస్తకాలు.. ఎక్కడి నుంచి వస్తు్న్నాయని ఆశ్చర్యపోయిన వాహనదారులు
X

ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో సామూహిక నకలు ఉదంతం మరోసారి బయటపడింది. ఎగ్జామ్ రూమ్‌లో పుస్తకాలు, ఫోన్లు దగ్గర పెట్టుకొని సులభంగా పరీక్ష రాస్తున్న విద్యార్థులు.. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుందనే సమాచారం అందుకున్న క్షణాల్లోనే గందరగోళానికి గురయ్యారు. ఒక్కసారిగా భయపడి, ఎవరి చేతిలో ఏమున్నా కిటికీల్లోంచి బయటకు విసిరేయడం ప్రారంభించారు. పైఅంతస్తుల నుంచే పుస్తకాలు గాలిలో ఎగిరి రోడ్డుపై పడిపోవడం చూసి, బయట వెళ్తున్నవాళ్లు షాక్ కు గురయ్యారు.

గాల్లో నుంచి పడుతున్న పుస్తకాలు..

ఒక్కో పుస్తకం గాల్లో తేలుతూ కింది పడిన తీరు చూస్తే, క్లాసురూమ్ లోపల ఎంత ప్లాన్ జరిగిందో అర్థమవుతుంది. విద్యార్థులు ఎవరు గమనిస్తున్నారో, ఎవరైనా వీడియో తీస్తున్నారో అనే ఆలోచన లేకుండా, ‘ఎలాగైనా పట్టుబడకూడదు’ అన్న ఆతృతతో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. కేవలం పుస్తకాలు మాత్రమే కాదు.. కొందరు ఫోన్లను బయటకు విసిరేశారు. పరీక్ష మధ్యలోనే ఇంత పెద్ద గందరగోళం జరగడంతో ఆ సెంటర్ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పై ఫ్లోర్‌లోని క్లాసుల నుంచి ఒక్కసారిగా పుస్తకాలు, నోట్‌బుక్స్ కురిసిపడుతున్న దృశ్యం నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. విద్యార్థులు పరీక్షలను ఎంత సరదాగా తీసుకుంటున్నారు? యూనివర్సిటీ మానిటరింగ్ ఎంత నిర్లక్ష్యంగా ఉంది? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సెంటర్‌కి చేరుకునేలోపే, అక్కడి విద్యార్థులు తమ అక్రమ ‘అస్త్రాలను’ బయటికి విసిరేసి సీన్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.

యూనివర్సిటీ తీరుపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు..

ఓయూ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కొత్త విషయం కాదు.. కానీ ఈసారి విద్యార్థుల పరుగులు, కిటికీల్లోంచి పుస్తకాలు పడవేస్తున్న తీరు మాత్రం యూనివర్సిటీ పరిపాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్లు, గైడ్‌లు, నోట్‌లు ఇలా ఎటువంటి పదార్థాలూ ఉండకుండా చర్యలు తీసుకోవాలి అనేది నియమం. కానీ ఇక్కడ మాత్రం క్లాస్‌రూంలోనే పుస్తకాలు విరివిగా ఉండడం, ఫ్లయింగ్ స్క్వాడ్ రాకవరకు ఎవరూ పట్టించుకోకపోవడం పరీక్షా వ్యవస్థపై అనుమానాలు రేపుతున్నాయి.

ఈ వీడియోలు బయటకు రావడంతో ఓయూ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపీయింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే యూనివర్సిటీ.. ప్రాక్టికల్‌గా మాత్రం ఇటువంటి ఘటనలు జరుగుతుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ ఘటనతో, పరీక్షల నిర్వహణలో పటిష్ట పర్యవేక్షణ ఎంత అవసరమో మరోసారి స్పష్టమైంది.