Begin typing your search above and press return to search.

5300 ఏళ్ల నాటి శ‌వం చెక్కు చెద‌ర‌కుండా.. ఐస్‌మ్యాన్‌ని చూసి ప‌ర్వ‌తారోహ‌కుడు షాక్!

5300 ఏళ్ల నాటి మృత‌దేహం ఇప్ప‌టికీ భ‌ద్రంగా ఉంది. క్రీస్తు పూర్వం మంచు కొండ‌ల్లో చిక్కుకుపోయిన అత‌డు ప్రాచీన చ‌రిత్ర‌ను క‌నుగొన‌డానికి ఆధారంగా మార‌డం ఇప్పుడు సంచ‌ల‌న‌మైంది.

By:  Sivaji Kontham   |   28 April 2026 8:00 PM IST
5300 ఏళ్ల నాటి శ‌వం చెక్కు చెద‌ర‌కుండా.. ఐస్‌మ్యాన్‌ని చూసి ప‌ర్వ‌తారోహ‌కుడు షాక్!
X

5300 ఏళ్ల నాటి మృత‌దేహం ఇప్ప‌టికీ భ‌ద్రంగా ఉంది. క్రీస్తు పూర్వం మంచు కొండ‌ల్లో చిక్కుకుపోయిన అత‌డు ప్రాచీన చ‌రిత్ర‌ను క‌నుగొన‌డానికి ఆధారంగా మార‌డం ఇప్పుడు సంచ‌ల‌న‌మైంది. ఆది మాన‌వుడి ఉనికి గురించి జ‌రిగే ప‌రిశోధ‌న‌ల్లోను ఇది అత్యంత కీల‌కంగా మారింది. అస‌లింత‌కీ ఈ మృత‌దేహం ఏ మంచు కొండ‌ల్లో ల‌భ్య‌మైంది? అంటే... ఇట‌లీలోని ఆల్ఫ్ ప‌ర్వ‌తాల్లో ల‌భ్య‌మైంది.

ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ప్ర‌యాణిస్తూ 1991 సెప్టెంబర్ 19న ఎరికా, హెల్ముట్ సైమన్ అనే దంపతులు చేసిన ఒక చిన్న పొరపాటు ప్రపంచ చరిత్రనే మార్చేసింది. వారు తమ ట్రెక్కింగ్ ముగించుకుని ఇంటికి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో దారి తప్పి మంచు గడ్డకట్టిన లోయలోకి ప్రవేశించారు. అక్కడ వారికి మంచులో కూరుకుపోయిన ఒక వింతైన ఆకారం కనిపించింది. అది ఒక సాధారణ శవం అని.. ఎవరో పర్వతారోహకుడు ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని వారు భావించారు. కానీ ఆ మృతదేహం గిజా పిరమిడ్ల కంటే పురాతనమైనదని వారికి అప్పుడు తెలియదు.

తొలుత ఈ అన్వేషణ చాలా గందరగోళంగా సాగింది. అది ఇటీవలే మరణించిన వ్యక్తి మృతదేహం అనుకుని అధికారులు డ్రిల్లింగ్ యంత్రాలు, ఐస్ పిక్స్‌తో తవ్వకాలు జరిపారు. అయితే ఆ శవం వద్ద లభించిన రాగి గొడ్డలి, రాతి కత్తి వంటి వస్తువులను చూసిన తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు విస్తుపోయారు. అది క్రీస్తుపూర్వం 3300 కాలానికి చెందిన మనిషి అని తేలడంతో `ఓట్జీ` అని నామకరణం చేశారు. ఐదు వేల ఏళ్ల పాటు మంచులో భద్రంగా ఉండటం వల్ల అతడి చర్మం, అవయవాలు, చివరికి ఒంటిపై ఉన్న పచ్చబొట్లు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి.

ఓట్జీ జీవనశైలిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మరణించే సమయానికి అతని వయస్సు సుమారు 45 ఏళ్లు. అతడు తన వెంట విల్లు, బాణాలు, చెక్క , చర్మంతో చేసిన బ్యాగు వంటి వస్తువులను తీసుకువెళ్తున్నాడు. చలి నుండి తట్టుకోవడానికి అతను ధరించిన దుస్తులు, గడ్డితో నింపిన బూట్లు ఆ కాలపు మానవుడి సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటిచెప్పాయి. అతడి జీర్ణాశయాన్ని పరిశీలించగా.. మరణానికి కొద్దిసేపటి ముందు అతను ధాన్యాలు, మాంసం, కొవ్వుతో కూడిన అధిక క్యాలరీల ఆహారం తీసుకున్నట్లు తేలింది.

ఓట్జీ మరణం వెనుక ఉన్న రహస్యం దశాబ్దాల పాటు పరిశోధకులను వేధించింది. తొలుత అతడు చలికి గ‌డ్డ క‌ట్టి చ‌నిపోయాడ‌ని.. లేదూ ప్రమాదవశాత్తూ చనిపోయాడని భావించారు. కానీ ఆధునిక ఎక్స్‌-రే పరీక్షల్లో అతడి భుజం వద్ద ఒక రాతి బాణం గుచ్చుకున్నట్లు గుర్తించారు. అంటే ఓట్జీ ప్రమాదవశాత్తూ చనిపోలేదు.. ఎవరో అతనిని హత్య చేశారని తేలింది. దీంతో ఈ కేసు వంద‌ల‌ ఏళ్ల క్రితం జరిగిన ఒక హింసాత్మక హత్యగా చరిత్రలో నిలిచిపోయింది. ఒక సామాన్యుడి శవం నుండి ఒక చారిత్రక సాక్ష్యంగా ఓట్జీ రూపాంతరం చెందాడు.

ప్రస్తుతం ఓట్జీ ఇటలీలోని ఒక ప్రత్యేకమైన కోల్డ్ రూమ్‌లో భద్రంగా ఉన్నాడు. ఎరికా - హెల్ముట్ సైమన్ దంపతులు కేవలం సులభమైన దారిలో ఇంటికి వెళ్లాలనుకున్నారు.. కానీ వారు చరిత్రలోనే అత్యంత కీలకమైన పురావస్తు అన్వేషణలో భాగమయ్యారు. ఐదు వేల ఏళ్ల నాటి ప్రాచీన మానవ నాగరికతకు.. జీవన విధానానికి ఓట్జీ నేటికీ ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాడు. మంచు పొరల్లో దాగిన ఈ మర్మం మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విజ్ఞాన శాస్త్రానికి ఒక గొప్ప నిధిలా మారింది.

మ‌మ్మీలో బాక్టీరియాతో ప్ర‌మాదం:

చ‌రిత్ర‌లో ఇంకా ఇలాంటి ర‌హ‌స్యాల ఉన్నాయి. మంచు పర్వతాలలో గడ్డకట్టిన స్థితిలో లభించే మృతదేహాలు శాస్త్రవేత్తలకు చారిత్రక ఆధారాలను అందించడమే కాకుండా.. పర్యావరణానికి కొన్ని సవాళ్లను కూడా విసిరే అవకాశం ఉంది. వేల ఏళ్ల క్రితం నాటి మృతదేహాలు బయటపడినప్పుడు.. వాటితో పాటు ఆ కాలంలో నిద్రాణంగా ఉన్న ప్రాచీన వైరస్‌లు లేదా బ్యాక్టీరియాలు తిరిగి క్రియాశీలకం కావచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు వేగంగా కరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మానవాళికి తెలియని లేదా అంతరించిపోయాయని భావించిన వ్యాధులు మళ్లీ బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆందోళన కలిగించే విషయం.

మరోవైపు ఈ మృతదేహాలు పురావస్తు శాస్త్రానికి ఒక అపురూపమైన నిధి వంటివి. ఎముకలు, కణజాలం.. ఆనాటి దుస్తులు భద్రంగా ఉండటం వల్ల ప్రాచీన మానవుల ఆహారపు అలవాట్లు, జన్యు సంపద.. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం సులభమవుతుంది. అంటే మంచు కరగడం వల్ల బయటపడే ఈ `ఐస్ మమ్మీలు`మనకు గతాన్ని పరిచయం చేసే విజ్ఞాన భాండాగారాలుగా మారుతూనే మరోవైపు జీవవైవిధ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి.