Begin typing your search above and press return to search.

భూమికి చేరిన బెన్ను నమూనాలు...ఏం చెప్పనున్నాయి?

అవును... భూమికి ప్రమాధకారి కాబోతుందని అంచనా వేస్తున్న బెన్నూ గ్రహశకలానికి సంబంధించిన నమూనాలను భూమిపైకి తెచ్చింది నాసా

By:  Tupaki Desk   |   25 Sep 2023 7:53 AM GMT
భూమికి చేరిన బెన్ను నమూనాలు...ఏం చెప్పనున్నాయి?
X

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా మరో సంచలనం సృష్టించింది. భూమి, సూర్యుడు సహా సౌర కుటుంబంతో పాటు జీవం ఎలా పుట్టింది, భూమిపైకి నీరు ఎలా వచ్చింది వంటి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉంది. ఇదే సమయంలో భూమికి ప్రమాదంగా మారిన గ్రహ శకలాలపైనా తన దృష్టిని సారించింది. ఇందులో భాగంగా బెన్నూ నుంచి శాంపిల్స్ సేకరించింది.

అవును... భూమికి ప్రమాధకారి కాబోతుందని అంచనా వేస్తున్న బెన్నూ గ్రహశకలానికి సంబంధించిన నమూనాలను భూమిపైకి తెచ్చింది నాసా. దీనికోసం ఏర్పాటు చేసిన "ఒసైరిస్‌-రెక్స్‌" వ్యోమనౌక దిగ్విజయంగా తన బాధ్యతను నెరవేర్చింది. ఇందులో భాగంగా... సుమారు ఏడేళ్ల పాటు రోదసిలో ప్రయాణించి ఒక గ్రహశకలం నుంచి శాంపుల్స్ ని భూమికి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆ నమూనా ఏమి చెప్పబోతుంది.. ఎలాంటి గుట్టు విప్పబోతుంది.. అనేది ఆసక్తికరంగా మారింది.

ఏమిటీ బెన్ను.. ఎందుకీ శాంపుల్స్?

2100 సంవత్సరంలోపు భూమిని ఢీకొడుతుందేమో అనే అంచనాతో ఉన్న ఒక గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు 1999లో కనుగొన్నారు. దీని వెడల్పు 500 మీటర్లు కాగా.. ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వస్తుంది. ఈ సమయంలో దీనికి బెన్ను అని నామకరణం చేశారు. అనంతరం ఈ గ్రహశకలం నుంచి శాంపుల్స్ ని సేకరించేందుకు ప్రాణాళికలు రచించారు.

ఇందులో భాగంగా... బెన్నుపై శాంపిల్స్ తెచ్చేందుకు "ఒసైరిస్‌-రెక్స్‌"ను 2016 సెప్టెంబరులో నాసా ప్రయోగించింది. సుమారు 100 కోట్ల డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ నేపథ్యంలో ఒసైరిస్-రెక్స్ 2018లో బెన్నును చేరింది. రెండేళ్ల పాటు దాని చుట్టూ పరిభ్రమించింది. అనంతరం 2020 అక్టోబరు 20న బెన్నూ ఉపరితలంపై దిగి నమూనాలను సేకరించింది. ఆ తర్వాత భూమికి తిరుగు ప్రయాణమైంది.

ఈ నేపథ్యంలో సుమారు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్‌-రెక్స్‌.. తాజాగా భూమికి చేరువైంది. ఈ సమయంలో భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఒసైరిస్‌-రెక్స్‌ నుంచి శాంపిల్‌ క్యాప్సూల్‌ విడిపోయింది. అనంతరం సుమారు నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్‌ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొచ్చింది.

అనంతరం అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. దీంతో హెలికాప్టర్‌ లో అక్కడకు వెళ్లిన బృందాలు.. దాన్ని సేకరించి, సమీపంలోని టెంపరరీ క్లీన్‌ రూం లోకి తరలించాయి. అనంతరం అక్కడి నుంచి నాసా స్పేస్‌ సెంటర్‌ కు పంపుతారు. ఇలా గ్రహశకలం నమూనాల కోసం పంపబడిన "ఒసైరిస్‌-రెక్స్‌".. తన ఏడేళ్ల ప్రస్థానంలో సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది.

ఈ బెన్ను.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్‌ తరగతి గ్రహశకలం అని చెబుతున్న శాస్త్రవేత్తలు... దీన్ని పరిశోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చుని భావిస్తున్నారు. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి అనేది తెలిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.