Begin typing your search above and press return to search.

6గురు భార్యలు, 14 మంది పిల్లలు, 52 మంది తోబుట్టువులు.. ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది

లాడెన్ 1979లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే తీవ్రవాద ముస్లింలతో సంబంధాలు ఏర్పడ్డాయి.

By:  Tupaki Desk   |   3 May 2025 2:45 AM
6గురు భార్యలు, 14 మంది పిల్లలు, 52 మంది తోబుట్టువులు.. ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది
X

ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ గురించి తెలియని వారుండరు. సెప్టెంబర్ 11 దాడులతో ప్రపంచంలోని అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పై జరిగిన ఈ దాడి తర్వాత లాడెన్ ను పట్టుకోవడం అమెరికాకు అతిపెద్ద సవాల్ గా మారింది. చివరికి అమెరికా అతడిని 2011 మే 2న పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో మట్టుబెట్టింది

లాడెన్ అసలు పేరు ఒసామా బిన్ ముహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్. 1957 మార్చి 10న సౌదీ అరేబియాలో పుట్టిన లాడెన్‌కు 52 మంది తోబుట్టువులు ఉన్నారు. తన తల్లిదండ్రులకు 17వ సంతానం లాడెన్. అతడి తండ్రి సౌదీ అరేబియాలో పెద్ద కన్ స్ట్రక్షన్ వ్యాపారి. లాడెన్‌కు తన తండ్రి ఆస్తిలో అప్పట్లోనే 8 కోట్ల డాలర్లు అంటే దాదాపు 700 కోట్ల రూపాయల వాటా వచ్చింది.

లాడెన్ 1979లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే తీవ్రవాద ముస్లింలతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1974లో 17 ఏళ్ల వయసులో సిరియాకు చెందిన నజ్వాను ప్రేమించి పెళ్లి చేసకున్నాడు. వీరికి అబ్దుల్లా, అబ్దుల్ రెహ్మాన్, సాద్, ఒమర్, ఉస్మాన్, ముహమ్మద్, ఫాతిమా, ఇమాన్, లాదిన్ బకిర్, రుకయ్యా, నూర్ అనే 11 మంది పిల్లలు కలిగారు. 9/11 దాడులకు ముందు లాడెన్, నజ్వా ఇద్దరూ విడిపోయారు. 1983లో ఖాదిజాను పెళ్లి చేసుకున్నాడు. 1995లో ఆమెతో విడాకులు అయ్యాయి. వారికి అలీ, అమెర్, అలిషా అనే ముగ్గురు పిల్లలుున్నారు.

ఆ తర్వాత 1985లో ఖైరియాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె 2011లో చనిపోయింది. ఆమె ద్వారా అతడికి హంజా అనే కుమారుడు ఉన్నాడు. 1987లో సిహమ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. 1996లో మరో మహిళను, 2000లో అమల్‌ను పెళ్లి చేసుకున్నాడు. అమల్‌కు సైఫియా, ఆసియా, ఇబ్రహీం, జైనబ్, హుస్సేన్ అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. మొత్తంగా లాడెన్‌కు ఆరుగురు భార్యలు, 14 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.

1979లో ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లిన లాడెన్ సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నాడు. అక్కడ దాదాపు పదేళ్లు ఉండి తన వ్యాపారం ద్వారా ముస్లిం గెరిల్లా పోరాట యోధులకు సహాయం చేశాడు. 1988లో అల్-ఖైదాలో చేరి, చివరికి దానికి నాయకుడిగా ఎదిగాడు. 1991లో సౌదీ అరేబియా నుండి బహిష్కరణకు గురయ్యాడు. తర్వాత సూడాన్, చివరకు ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వెళ్లాడు. 9/11 దాడుల తర్వాత అమెరికా లాడెన్‌ను వెతకడం మొదలు పెట్టింది. చాలా ఏళ్ల తర్వాత 2011 మే 2న పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాలు దాడి చేసి లాడెన్‌ను చంపాయి. ఆ సమయంలో అతడి భార్య అమల్ బెడ్‌రూమ్‌లో అతడితో ఉంది.