ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలేనా ?
తమకు కలిసి వస్తుందని మహిళా రిజర్వేషన్ బిల్లుని ముందు పెట్టి డీలిమిటేషన్ బిల్లుతో ముడి పెడుతూ ఎన్డీయే ప్రభుత్వం చేసిన రాజకీయ విన్యాసం బెడిసికొట్టింది.
By: Satya P | 19 April 2026 4:00 AM ISTతమకు కలిసి వస్తుందని మహిళా రిజర్వేషన్ బిల్లుని ముందు పెట్టి డీలిమిటేషన్ బిల్లుతో ముడి పెడుతూ ఎన్డీయే ప్రభుత్వం చేసిన రాజకీయ విన్యాసం బెడిసికొట్టింది. అవసరమైన మద్దతు కూడగట్టలేకపోయింది. ఫలితంగా కేంద్రం అనుకున్నది జరగలేదు. అయితే ఇక్కడ బీజేపీ వ్యూహాలు ఫెయిల్ అయ్యాయి అనడం కంటే విపక్షం కసి పెరిగింది అనడమే బెటర్. విపక్షాలు అన్నీ ఒక్క త్రాటి మీదకు రావడం మునుపెన్నడూ లేని విధంగా ఐక్యతను ప్రదర్శించడం వల్లనే బీజేపీ పాచికలు పారలేదని అంటున్నారు.
అయిదు రాష్ట్రాల ఫలితాలు :
సరిగ్గా ఈ సమయంలోనే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మే 4న దేశంలోని అస్సాం, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. ఇందులో అస్సాం మాత్రమే బీజేపీకి ఆశలు ఉన్నాయి. అలాగే పాండిచ్చేరి గెలిచినా అది కేంద్ర పాలిత ప్రాంతం. బీజేపీ టార్గెట్ పశ్చిమ బెంగాల్. అలాగే తమిళనాడులో అన్నా డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు. కానీ ఈ రెండూ తీరేటట్లు పరిస్థితి ఉందా అన్నదే ఒక పెద్ద చర్చ. ఒక వేళ అలా కాకపోతే బీజేపీకి మరిన్ని చిక్కులు రాజకీయంగా రానున్నాయి.
దిగ్గజ నేతలుగా :
పశ్చిమ బెంగాల్ కి నాలుగవ సారి సీఎం అవడం అంటే మాటలు కాదు, ఆ రేర్ ఫీట్ ని సాధించి మమతా బెనర్జీ కనుక జెండా ఎత్తితే అపుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే అని అంటున్నారు. అలాగే దక్షిణాది ఉత్తరాది అంటూ తెగ రచ్చ చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ రెండోసారి సీఎం అయ్యారు అంటే ఆయన కూడా జాతీయ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయేలా చేసి ఇండియా కూటమి ఎన్డీయే మీద పై చేయి సాధించింది. దాంతో సమరోత్సాహంతో ఉంది. దానికి అదనంగా ఈ విజయాలు దక్కితే కేరళలో కాంగ్రెస్ గెలిచి అధికారం అందుకుంటే మాత్రం సీఎన్ మామూలుగా ఉండదని అంటున్నారు.
స్వల్ప మెజారిటీతో :
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వల్ప మెజారిటీతో కొనసాగుతోంది. 293 మంది ఎంపీలు మాత్రమే ఆ కూటమికి ఉన్నారు. అదే సమయంలో 233 మంది ఎంపీల బలంతో చాలా సమీపంలో ఇండియా కూటమి ఉంది ఈ రెండు కూటముల మధ్య తేడా కేవలం 60 సీట్లు మాత్రమే. ఇక చూస్తే రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీల సొంత బలం ఉంది. టీడీపీ నుంచి 16 మంది జనసేన నుంచి ఇద్దరు, జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ నుంచి 12 మంది మద్దతుగా నిలిచారు. అలాగే కొన్ని చిన్న పార్టీల సపోర్టు ఉంది. ఇందులో ఏ వైపు నుంచి ఏమి జరిగినా కూడా త్రాస్ అటు నుంచి ఇటు మారుతుంది అన్న చర్చ ఉండనే ఉంది.
కేజ్రీవాల్ మమతా ప్రకటనలు :
ఇంకో వైపు చూస్తే ఆ మధ్య ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కానీ అలాగే మమతా బెనర్జీ కానీ ఒకే మాట అన్నారు. ఈ ఏడాది అంతానికి మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉండదని. దాని అర్ధం ఏమిటి అన్నది ఆనాడు ఎవరికీ అర్ధం కాలేదు. కానీ పార్లమెంట్ లో ఎన్ డీయేకు తొలి ఓటమి చూపించి పూర్తి పటిష్టంగా ఉన్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత పావులు వేగంగా కదిపే అవకాశాలు ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఢిల్లీ రాజకీయాలు రానున్న రోజులలో కాక పుట్టిస్తాయని అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏ మేరకు నిజముందో.
