Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో ఆపరేషన్లు... గాజాలో పరిస్థితి ఘోరం!

ఇదే సమయంలో ఇప్పటిదాకా గాజాలో మొత్తంగా 4,137 మంది మరణించగా 13 వేలమందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 3:59 AM GMT
సెల్  ఫోన్  టార్చ్  వెలుగులో ఆపరేషన్లు... గాజాలో పరిస్థితి ఘోరం!
X

యూట్యూబ్ లో చూస్తూ ఆపరేషన్ చేస్తున్నాను అనేది మనకు ఒక జోక్! అంటే... యూట్యూబ్ పై ఆ స్థాయిలో ఆధారపడిపొతున్నామనే అర్ధం కావొచ్చు..! కానీ.. సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి, ఆ వెలుతురులో ఆపరేషన్ చేస్తున్న దయణీయమైన పరిస్థితి ప్రస్తుతం గాజాలో నెలకొంది. ఇజ్రాయేల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన ఒక దుశ్చర్య... ప్రస్తుతం గాజాలోని పాలస్తీనీయులకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది!

అవును... గాజాపై ఇజ్రాయెల్‌ బలగాల భీకర దాడులు అవిరామంగా కొనసాగుతున్నాయి. నిన్నమొన్నటివరకూ ఉత్తరగాజాను ఖాళీ చేసి దక్షిణ గాజావైపు వెళ్లమని హెచ్చరికలు చేసిన ఇజ్రాయేల్ సైన్యం... ఇప్పుడు ప్రధానంగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ పట్టణంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఫలితంగా... పలుచోట్ల బాంబుల వర్షం కురిసింది. దీంతో... ఖాన్‌ యూనిస్‌ లోని నాసర్‌ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.

ఈ సమయంలో గాజాలో హమాస్‌ మిలిటెంట్లకు సంబంధమున్న ఒక సొరంగం సహా 100కు పైగా లక్ష్యాలపై తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోపక్క ఓ గ్రీక్‌ ఆర్థోడాక్స్‌ చర్చిపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 16 మంది పాలస్తీనా క్రైస్తవులు చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో ఇప్పటిదాకా గాజాలో మొత్తంగా 4,137 మంది మరణించగా 13 వేలమందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది.

ఈ పరిస్థితుల్లో గాజాలోని అన్ని ఆసుపత్రులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. క్షతగాత్రులతో నిండిపోయాయి. ప్రతీ ఆసుపత్రి పరిశరాలూ... స్మశానాలను తలపిస్తున్నాయని చెప్పినా అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ఇక వేల సంఖ్యలో క్షతగాత్రులు చేరిపోవడంతో వైద్య సామగ్రి కొరత తీవ్రస్థాయికి చేరుకుందని తెలుస్తుంది.

మరోపక్క ఇప్పటికే గాజాను ఇజ్రాయేల్ సైన్యం అష్టదిగ్భందనం చేయడం.. అందులో భాగంగా విద్యుత్తు సరఫరా నిలిపేయడం తెలిసిందే. ఇదే క్రమంలో ఇందనం కూడా నిలిపివేయడంతో జనరేటర్లూ పనిచేయట్లేదు. ఈ పరిస్థితుల్లో చాలా ఆసుపత్రుల్లో వైద్యులు సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. దీంతో... ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది!

ఈ నేపథ్యంలో చివరి హమాస్ ఉగ్రవాదిని తుదముట్టించే వరకూ గాజాను వదిలే ప్రసక్తి లేదని ఇజ్రాయేల్ ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా... హమాస్‌ ను పూర్తిగా తుదముట్టించాక గాజా నుంచి తమ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేస్తాయని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యొయావ్‌ గాలంట్‌ స్పష్టంచేశారు. అక్కడ పరిపాలన చేపట్టాలనే ప్రణాళికలేవీ తమకు లేవని చెప్పారు.

ఇదే సమయంలో... గాజాలో మూడు దశల్లో యుద్ధం చేయాల్సి వస్తుందని అంచనా వేసుకున్నట్లు చెప్పిన యొయావ్ గాలంట్... వైమానిక దాడులతో పాటు భూతల దాడులూ అందులో భాగమని వెల్లడించారు. మరోపక్క లెబనాన్‌ తో తమ సరిహద్దుల్లోని కీలక కిర్యత్‌ ష్మోనా పట్టణాన్ని ఇజ్రాయెల్‌ ఖాళీ చేయిస్తోంది. దీంతో... గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోందని చెప్పేందుకు ఇది సంకేతమని అంటున్నారు పరిశీలకులు.