Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సొరంగం : 17 రోజుల తరువాత 41 మందిని రక్షించారు...

ఉత్తరాఖండ్ లోని సిల్క్యారాలోని సొరంగంలో భూగర్భంలో చిక్కుకున్న మొత్తం 41 మంది ఈ విధంగా కొత్త జీవితాలను చూసారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:24 AM GMT
ఆపరేషన్ సొరంగం  : 17 రోజుల తరువాత 41 మందిని రక్షించారు...
X

ఆపరేషన్ సొరంగం ఉత్తరాఖండ్ లో సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. ఫలితంగా గత 17 రోజులుగా సొరంగం లో చిక్కుకుని 17 రోజుల పాటు బతుకు పోరాటం చేసిన 41 మందికి విముక్తి కలిగింది. బయట ప్రపంచం ముఖం వారు చూడగలిగారు. ఉత్తరాఖండ్ లోని సిల్క్యారాలోని సొరంగంలో భూగర్భంలో చిక్కుకున్న మొత్తం 41 మంది ఈ విధంగా కొత్త జీవితాలను చూసారు.

నిజంగా ఇది రిస్క్ తో కూడుకున్న ఆపరేషన్. కేంద్రం చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా 4.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు టన్నెల్ కూలిపోవడంతో నవంబర్ 12వ తేదీన సొరంగం లో పూర్తిగా చిక్కుకుని పోయారు.

ఇక ఈ ప్రాజెక్ట్ దేని కోసమంటే ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలు అయిన బద్రీనాథ్ కేదార్‌నాథ్ గంగోత్రి యమునిత్రి మధ్య పూర్తి స్థాయిలో కనెక్టివిటీని అందించడం కోసం చేపట్టారు. దాని కోసం పనిచేస్తున్న ఈ కార్మికులు అంతా 17 రోజుల పాటు తమ ప్రాణాలతో పోరాడారు అనే చెప్పాల్సి ఉంది.

వారంతా తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని ఇన్ని రోజులూ గడిపారు. వారిని ఎలా బయటకు తీసుకుని రావాలన్న దాని మీద ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితం లభించింది. ఇక ఈ కార్మికులను విడతల వారీగా బయటకు తీసుకుని వచ్చారు. ఇలా చిక్కుకునిపోయిన కార్మికులు అందరినీ ప్రత్యేక స్ట్రెచర్లపై బయటకు తీసుకువచ్చారు, వాటిని రెండు మీటర్ల వెడల్పు పైపు ద్వారా కొండపైకి వేసిన రంధ్రాలలోకి చొప్పించారు. ప్రతి కార్మికుడిని దానికి కట్టి 60 మీటర్ల రాతి ద్వారా చాలా జాగ్రత్తగా పైకి లాగడంతో వారు బయటపడగిగారు.

అనంతరం వారిని ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా చిన్యాలిసౌర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక ఈ సొరంగంలో చిక్కునిని పోయిన కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష వంతున ఆర్ధిక సాయమన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. వారు పూర్తిగా కోలుకుని ఇళ్ళకు వెళ్లేంతవరకూ ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తి ఉచితంగా వైద్యం అందించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ మొత్తం ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోందని ఆయన అన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారి ధైర్యం సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

వారందరికీ మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నానని అన్నారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఇప్పుడు మీ స్నేహితులు ఆత్మీయులను కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం అని అన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆనందం వ్యక్తం చెశారు. రోజుల తరబడి అధికారులు సిబ్బంది పడిన శ్రమ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది అని అంతా ప్రశంసిస్తున్నారు.