రష్యాకు నిద్రపట్టనివ్వనిది ఇతడే.. డ్రోన్ దాడి మాస్టర్ మైండ్ దొరికాడు!
రష్యా (Russia) వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ (Ukraine) ఇటీవల జరిపిన భారీ డ్రోన్ దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి.
By: Tupaki Desk | 4 Jun 2025 5:00 AM ISTరష్యా (Russia) వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ (Ukraine) ఇటీవల జరిపిన భారీ డ్రోన్ దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఈ దాడులు రష్యాకు కోలుకోలేని నష్టాన్ని కలిగించాయి. 'ఆపరేషన్ స్పైడర్స్ వెబ్' (Operation Spider’s Web) గా పిలువబడుతున్న ఈ సంచలనాత్మక దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారిని 'డైలీ మెయిల్' బయటపెట్టింది. రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు (Russian intelligence agencies) అతడిని ఆర్టెమ్ తిమోఫీవ్ (Artem Timofeev)గా గుర్తించాయి. అతని కోసం దేశమంతా గాలిస్తున్నట్లు సమాచారం.
ఆర్టెమ్ తిమోఫీవ్ ఉక్రెయిన్ రహస్య ఏజెంట్‌గా గుర్తించారు. అతను రష్యాలోనే ఉంటూ ఈ కుట్రకు సూత్రధారిగా వ్యవహరించాడని భావిస్తున్నారు. అతనిని అరెస్టు చేయడం ఇప్పుడు రష్యాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. అర్టెమ్ ఉక్రెయిన్‌లోని ఝైటోమిర్ (Zhytomyr) నగరంలో జన్మించాడు. ఆ తర్వాత కొంతకాలం కీవ్ (Kiev) లో నివసించాడు. అనంతరం, వ్యాపారం పేరుతో చెల్యాబిన్స్క్ (Chelyabinsk) కు మారి అక్కడే స్థిరపడ్డాడు. 'ఆపరేషన్ స్పైడర్స్ వెబ్' ప్రారంభం నుంచే అతను ఒక స్లీపర్ సెల్ (sleeper cell) గా వ్యవహరించాడని నివేదించింది.
డ్రోన్‌లను ఎయిర్‌బేస్‌లకు రవాణా చేయడానికి అర్టెమ్ నలుగురు భారీ వస్తువుల డ్రైవర్లను నియమించుకున్నాడు. వారికి చెక్క ఫామ్‌హౌస్‌లను వేర్వేరు ప్రదేశాలకు తరలించాలని చెప్పాడు. అయితే, ఎస్‌బీయు (SBU - Ukraine’s security service) ప్రకారం, డ్రోన్‌లు ఈ ఫామ్‌హౌస్‌ల పైకప్పుల కింద దాగి ఉన్నాయి. ఈ ట్రక్కులు కూడా అర్టెమ్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నాయి.
రష్యా దర్యాప్తు బృందం 55 ఏళ్ల డ్రైవర్ అలెగ్జాండర్‌ను(Alexander) ప్రశ్నించగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అర్టెమ్ అనే వ్యాపారవేత్త తనను ఫామ్‌హౌస్‌ను ముర్మాన్స్క్ (Murmansk) ప్రాంతానికి తరలించమని చెప్పాడని అలెగ్జాండర్ వెల్లడించాడు. ఆ తర్వాత, మరొక వ్యక్తి ఒలెన్యా ఎయిర్‌బేస్ సమీపంలోని రోస్‌నెఫ్ట్ పెట్రోల్ బంకు వద్ద లారీని ఆపాలని సూచించాడు.
మరొక డ్రైవర్, 46 ఏళ్ల సెర్గీ (Sergey) కూడా, మోడ్యులర్ హౌస్‌ను రియాజాన్ (Ryazan) ప్రాంతానికి తీసుకెళ్లమని తనకు చెప్పినట్లు తెలిపాడు. ఎక్కడ ఆపాలో తనకు సూచనలు అందాయని, అయితే, తాను ఆపకముందే ట్రక్కు వెనుక ఉన్న పైకప్పు కూలిపోయిందని.. ఆ తర్వాత డ్రోన్‌లు బయలుదేరి ఎయిర్‌బేస్ వైపు దూసుకుపోయాయని వివరించాడు. మిగతా డ్రైవర్లు కూడా అర్టెమ్ నుండే సూచనలు అందుకున్నారు. ఈ దాడిలో ప్రతి ఎయిర్‌బేస్‌పై కనీసం 30 డ్రోన్‌లు దాడి చేశాయని భావిస్తున్నారు.
'ఆపరేషన్ స్పైడర్స్ వెబ్'తో ఉక్రెయిన్ మొత్తం 41 రష్యన్ బాంబర్లను పేల్చివేసింది. ఇది రష్యా స్ట్రాటజిక్ బాంబర్లలో (strategic bombers) 34 శాతానికి సమానం. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రహస్య ఆపరేషన్ ఇదేనని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ఈ దాడి కోసం ఫస్ట్-పర్సన్ వ్యూ (FPV) సూసైడ్ డ్రోన్‌లను (suicide drones) ఉపయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా అతి తక్కువ ఖర్చుతో భారీ విధ్వంసం సృష్టించవచ్చని ఉక్రెయిన్ మరోసారి నిరూపించింది. ఈ దాడి రష్యా రక్షణ వ్యవస్థలలోని లోపాలను స్పష్టం చేయడమే కాకుండా, భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్‌ల పాత్ర ఎంత కీలకమో చాటి చెప్పింది.
