Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ సిందూర్'... ప్రపంచ దేశాల స్పందన ఇదే!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.

By:  Tupaki Desk   |   7 May 2025 10:02 AM IST
ఆపరేషన్  సిందూర్... ప్రపంచ దేశాల స్పందన ఇదే!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా... మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది.. మెరుపు దాడులు చేసింది.

ఈ ఘటనలో 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేయగా.. సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో... తమకు న్యాయం జరిగిందంటూ పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలు తెలిపాయి! ఇదే సమయంలో... పాక్ లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన దాడులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి.

అవును... పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైనిక చర్యలకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ దాడులు త్వరగా ముసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు శక్తివంతమైన దేశాలు ఇలా రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని.. భారత్, పాక్ కు ఎంతో చరిత్ర ఉందని ట్రంప్ తెలిపారు.

మరోవైపు పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్... అమెరికా సలహాదారు మార్క్ రూబియోతో మాట్లాడారు. ఈ దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులు పాక్ పౌరులు, సైనిక స్థావరాలపై చేయలేదని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడిపై ఇజ్రాయేల్ స్పందించింది. ఇందులో భాగంగా... ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది.. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి.. ఈ విషయంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్.

ఇదే సమయంలో... ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ స్పందించారు. ఇందులో భాగంగా... ఇరు దేశాల సైనికులు సంయమనం పాటించాలని అన్నారు. ఇదే క్రమంలో యూఏఈ ఉపప్రధాని షేక్ అబ్ధుల్ బిన్ జాయెద్ స్పందిస్తూ.. భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదని.. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అన్నారు.