ఆపరేషన్ సిందూర్ వేళ.. ట్రంప్ డబుల్ స్టాండ్ మాటల్ని విన్నారా?
కష్ట సమయాల్లో అసలైన మిత్రుడు ఎవరు? అవకాశవాదులు ఎవరు? అన్న విషయాలు ఇట్టే అర్థమవుతుంటాయి.
By: Tupaki Desk | 8 May 2025 10:28 AM ISTకష్ట సమయాల్లో అసలైన మిత్రుడు ఎవరు? అవకాశవాదులు ఎవరు? అన్న విషయాలు ఇట్టే అర్థమవుతుంటాయి. ఆపరేషన్ సిందూర్ వేళ.. అగ్రరాజ్యం అమెరికా ఎలా స్పందిస్తోంది. అధినేత ట్రంప్ ఎలా రియాక్టు అవుతున్నారన్నది కీలకం. దీనికి సంబంధించిన గడిచిన 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు.. ట్రంప్ తీరు భారతీయులకు నిరాశకు గురి చేస్తుందని చెప్పాలి. సామ్రాజ్యవాద విస్తరణ కోసమో.. వనరుల మీద కన్నేసి.. వాటిని సొంతం చేసుకోవటానికో.. అధిక్యతను ప్రదర్శించటానికో భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టలేదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు.
ఆ మాటకు వస్తే.. అదే పనిగా భారత్ లో ఉగ్రచర్యల్ని చేపట్టటం ద్వారా దెబ్బ కొట్టాలన్న దుర్మార్గ ఆలోచనలు పాకిస్తాన్ చేస్తుందన్న విషయం అమెరికాతో పాటు యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ.. అదేమీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆపరేషన్ సిందూర్ కు కారణమైన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాక్ హస్తం ఏమిటన్న విషయం అగ్రరాజ్యానికి తెలిసినా తెలియనట్లుగా ఉండటం కనిపిస్తుంది. తన దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఏమైనా చేసేందుకు వెనుకాడని అమెరికా.. దశాబ్దాల తరబడి భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడే పాక్ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించదన్నది ప్రశ్న.
ఎంతసేపటికి భారత్.. పాకిస్తాన్ రెండింటిని ఒకే గాటున కట్టేసి.. ఇద్దరికి సలహాలు ఇచ్చే పెద్దన్న పాత్రను పోషించేందుకు మాత్రమే అమెరికా రెఢీగా ఉంటుంది. ఇక్కడ.. బాధితులు ఎవరు? బాధ్యులు ఎవరు;? అన్నది వారికి అనవసరం. మోడీ తనకు చాలా మంచి మిత్రుడని చెప్పే ట్రంప్ సైతం.. భారత్.. పాకిస్తాన్ లు రెండు తమకు మిత్రదేశాలుగానే పేర్కొనటం ద్వారా.. రెండు దేశాలు తమకు ఒకటేనన్న విషయాన్ని చెప్పేయటం చూస్తే.. అమెరికాకు ఏం కావాలన్నది అర్థమవుతుంది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘భారత్.. పాక్ ల మధ్య పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. వాటితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని.. వాటిని ఆపేయాలని కోరుకుంటున్నా. రెండు దేశాలతో ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేస్తాను’’ అంటూ చేసిన వ్యాఖ్యల్లో భారత్.. పాక్ రెండు తమకు ఒకటే అన్న మాటలో అగ్రరాజ్యం తీరు ఏమిటన్నది తెలుస్తుంది.
ఆపరేషన్ సిందూర్ కు ముందు.. పహల్గాంలో 27 మంది అమాయకుల ప్రాణాల్ని తీసిన ఉగ్రవాదులు ఎవరు? వారి మూలాలు ఏమిటి? అన్నది అగ్రరాజ్యానికి తెలియంది కాదు. ఆ మాటకు వస్తే.. దానికి సంబంధించిన సమాచారం అమెరికాకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. మనకు మించిన సమాచారం అమెరికా వద్ద ఉంటుంది. ప్రపంచంలో తీవ్రవాదం ఎక్కడ ఉన్నా తాము ఉపేక్షించమని సొల్లు మాటలు చెప్పే అమెరికా.. భారత్ లో జరిగిన ఉగ్రదాడి మీద ఎందుకు సీరియస్ గా రియాక్టు కాదు? అన్నది ప్రశ్న.
తనను కవ్వించి.. తనకు నష్టం వాటిల్లేలా చేసే దాయాది పాక్ విషయంలో భారత్ ఓర్పుగా.. సహనంగా ఉన్నప్పటికి తరచూ ఏదో ఒకలా ఇబ్బంది పెట్టే పాక్ దుష్ట ఆలోచనలు అగ్రరాజ్యానికి తెలిసినప్పటికి.. తెలీనట్లుగా వ్యవహరించటం చూసినప్పుడు.. అగ్రరాజ్యానికి తన ప్రయోజనాలు తప్పించి మరేమీ ముఖ్యం కాదన్న విషయం తాజా ఎపిసోడ్ తో మరోసారి నిరూపితమైందని చెప్పాలి.