Begin typing your search above and press return to search.

ఆదివారం మీడియా భేటీకి ఆ ముగ్గురు ఎందుకు వచ్చారు?

అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే సీన్ ఒకటి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 10:43 AM IST
ఆదివారం మీడియా భేటీకి ఆ ముగ్గురు ఎందుకు వచ్చారు?
X

ఆపరేషన్ సిందూర్ వివరాల్ని వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అనూహ్య రీతిలో ఇద్దరు మహిళా అధికారులు హాజరు కావటం.. ఆ తర్వాతి దశల్లో నిర్వహించిన మీడియా బేఠీల్లోనూ వారు పాలు పంచుకోవటం తెలిసిందే. ఆ ఇద్దరు మహిళా అధికారుల్లో ఒకరు భారత సైన్యంలో కల్నల్ హోదాలో పని చేసే సోఫియా ఖురేషీ.. మరొకరు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. ఈ ఇద్దరితో కలిసి మరో సీనియర్ అధికారి కలిసి మీడియా భేటీలను నిర్వహించటం తెలిసిందే. కట్ చేస్తే.. ఆదివారం మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది.

అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే సీన్ ఒకటి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చోటు చేసుకుంది. దీనికి కారణం.. ఈ మీడియా భేటీకి భారత త్రివిధ దళాల అత్యున్నత అధికారులు సంయుక్తంగా హాజరు కావటమే. ఇలాంటి సన్నివేశం చాలా చాలా అరుదుగా చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ తర్వాత నిర్వహించిన మీడియా భేటీలకు భిన్నంగా ఆదివారం ఈ ముగ్గురు అత్యున్నత అధికారుల నడుమ మీడియా సమావేశం సాగింది. దీనికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజకీయ ఘాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీఏఓ) ఎయిర్ మర్షల్ ఏకే భారతి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (డీజీఎన్ ఓ) వైస్ ఆడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ లు హాజరయ్యారు.

ఎందుకిలా? అంటే.. దానికి సమాధానం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ముఖ్యంగా పాక్ మిలటరీ అధికారులు మొదలు కొని కీలక స్థానాల్లో ఉన్న పాక్ రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేపట్టటం.. అబద్దాల్ని బలంగా ప్రచారం చేయటం జరిగింది. దీంతో.. తప్పుడు సమాచారం విస్త్రతంగా వ్యాపించటమే కాదు.. భారత్ ను తక్కువగా చూపే పరిస్థితి నెలకొంది. చివరకు దేశ ప్రజలు సైతం కాల్పుల విరమణపై ట్రంప్ ముందుగా ప్రకటన చేయటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి.

మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాల్ని పాక్ కూల్చేసినట్లుగా సాగుతున్న తప్పుడు ప్రచారం అంతకంతకూ పెరిగి పెద్దది కావటం.. భారత్ తో పోలిస్తే పాక్ మెరుగైన దాడులు చేసిందన్న ఫేక్ వాదనను వాస్తవంగా మార్చే కుట్రలుజరుగుతున్న వేళ.. తాము వెల్లడించే సమాచారానికి అత్యంత ప్రాముఖ్యత లభించేందుకు వీలుగా ఈ ముగ్గురు పెద్ద మనుషులు మీడియా ముందుకు వచ్చి వివరాలు ప్రకటించారని చెప్పాలి.

ఆదివారం నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో వీరు ప్రకటించిన వివరాలు ప్రపంచానికి అధికారిక సమాచారంగా ఉపయోగపడే పరిస్థితి. ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించని పలు కీలక అంశాల్ని వీరు ప్రకటించారు. వీరి నోటి నుంచి వచ్చిన వివరాలు అధికారిక సమాచారంగా మారుతుంది. వీరి మాటలకు ఉండే విశ్వసనీయత చాలా ఎక్కువ. తాము జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన పలు అత్యాధునిక యుద్ధ విమానాల్ని నేలకూల్చామని.. 40 మందికి పైగా పాక్ సైనికులు మరణించినట్లుగా వీరు చెప్పారు. అంతేకాదు.. వంద మందికి పైనే ఉగ్రవాదులు హతమైనట్లుగా స్పష్టం చేశారు.

పాకిస్తాన్ లోనూ.. పాక్ అక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా చెప్పటంతో పాటు.. పాక్ రాజధాని ఇస్లామాబాద్ కు కూతవేటు దూరంలో అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నట్లుగా వారు పేర్కొన్నారు. లాహోర్ తదితర సైనిక స్థావరాల్లో కీలక రాడార్ వ్యవస్థలు నేలమట్టమైనట్లుగా చెప్పిన సమాచారం విన్నప్పుడు.. భారత్ జరిపిన దాడులు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఈ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ ముగ్గురు ముఖ్యులు మీడియా భేటీకి వచ్చారని చెప్పాలి.