పాక్ లో 118 పోస్టులు ధ్వంసం.. అమిత్ షా ఆసక్తికర విషయాలు!
అవును.. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జమ్మూలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
By: Tupaki Desk | 30 May 2025 6:04 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఉగ్ర శిబిరాలతోపాటు పాక్ సైనిక స్థావరాలనూ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పాకిస్థాన్ సైన్యాన్ని ఎలా వణికించింది.. సరిహద్దుల్లో ఉన్న ఆ దేశ సైనిక పోస్టులను ఎలా ధ్వంసం చేసిందనే విషయాలను అమిత్ షా తాజాగా వెల్లడించారు.
అవును.. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జమ్మూలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇలా జమ్మూకశ్మీర్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇటీవల పాక్ దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఎస్ఎఫ్ దళాలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిఏంద్ర హోంమంత్రి... ఇటీవల పాకిస్థాన్ లోని ఉగ్రస్థవరాలే లక్ష్యంగా మనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ప్రతిస్పందనగా దాయాదీ సైన్యం మన సరిహద్దుల్లోని పౌరులపై దాడులు చేసిందని.. అయితే, వీటిని బీ.ఎస్.ఎఫ్. దళాలు దీటుగా తిప్పికొట్టాయని.. ఈ క్రమంలో 118 పాక్ పోస్టులను ధ్వంసం చేశాయని అన్నారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం... భారత త్రివిధ దళాల అసమాన ప్రతిభ వల్లే పాకిస్థాన్ పై చేసిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయ్యిందని.. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు అమిత్ షా. ఈ సమయలో.. మనం కేవలం ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేశామని, ప్రజల జోలికి వెళ్లలేదని.. అయితే.. పాక్ మాత్రం మన జనావాసాలపై దాడులకు పాల్పడిందని తెలిపారు.
ఇదే సమయంలో.. శత్రువుల నిఘా వ్యవస్థను ఒక్కొక్కటిగా కూల్చివేశాయని.. ఇప్పుడు వాటికి పాక్ తిరిగి పునరుద్ధరించుకునేందుకు సుమారు నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫలితంగా.. కొంతకాలం పాటు పూర్తి సమాచార ఆధారిత యుద్ధాన్ని చేసే పరిస్థితిలో శత్రువు లేదని అమిత్ షా తెలిపారు. ఈ నేపథ్యంలొనే బీ.ఎస్.ఎఫ్. సంసిద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు.
ఇక.. ఇటీవల పాక్ జరిపిన దాడుల సందర్భంగా నష్టపోయిన కుటుంబాలను పరామర్శించిన అమిత్ షా... ఆ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన పరిహారాన్ని కేంద్రం త్వరలోనే ప్రకటిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు మాట్లాడారు.
