కీలక పరిణామం : పాక్ కు షాక్.. భారత్ కు బ్రిటన్ మద్దతు
హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
By: Tupaki Desk | 8 May 2025 8:54 AMపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు ప్రీతి పటేల్ గట్టిగా సమర్థించారు. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని ఆమె స్పష్టం చేశారు.
హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది స్పష్టంగా ఉగ్రవాద చర్య అని పేర్కొంటూ ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముంబయి, న్యూదిల్లీ వంటి నగరాల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మరక్షణ హక్కు భారత్‌కు ఉందని పునరుద్ఘాటిస్తూ, అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని ప్రీతి పటేల్ పేర్కొన్నారు. యూకే, భారత్‌ల మధ్య దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు బ్రిటన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తయ్యిబా సంస్థ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని చరిత్ర స్పష్టం చేస్తోందని ప్రీతి పటేల్ అన్నారు. ఇటీవల నివేదికల ప్రకారం, ఈ ఉగ్రవాద సంస్థకు హమాస్‌తో సంబంధాలున్నాయని ఆమె వెల్లడించారు. పాక్‌లో ప్రస్తుతం ఏ ఉగ్రవాద సంస్థలు చురుకుగా ఉండి యూకే, దాని మిత్రదేశాల ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆమె కోరారు.
-పాక్ ప్రతీకారానికి ప్రయత్నించొద్దు: అమెరికా ఎంపీ రో ఖన్నా
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా చట్టసభ సభ్యుడు రో ఖన్నా కూడా స్పందించారు. ఈసందర్భంగా పాకిస్థాన్ ప్రతీకారానికి ప్రయత్నించవద్దని ఆయన పిలుపునిచ్చారు. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనాలని కోరిన ఆయన, ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పాక్‌లో ప్రస్తుతం నిజాయతీ కలిగిన స్వరం లేదని విమర్శించిన రో ఖన్నా, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌ను నియంతగా అభివర్ణించారు.