భారత దెబ్బకు కుదేలైన పాక్ స్టాక్ మార్కెట్: స్థిరంగా భారత మార్కెట్లు
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
By: Tupaki Desk | 7 May 2025 3:43 PM ISTభారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా, భారత సైన్యం వ్యూహాత్మకంగా నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను భారీగా కుదిపేసింది.
బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ కరాచీ-100 ఏకంగా 6,272 పాయింట్లు లేదా దాదాపు 6 శాతం మేర పతనమై 107,296.64 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మంగళవారం ముగింపుతో పోలిస్తే ఇది భారీ నష్టం. ఏప్రిల్ 23న జరిగిన పహల్గామ్ దాడి తర్వాతి నుంచి కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిరంతరాయంగా క్షీణిస్తోంది. ఇప్పటివరకు ఈ ఎక్స్ఛేంజ్ దాదాపు 3.7% మేర పతనమైంది. భారత, పాక్ మధ్య కాల్పుల మార్పిడి భయం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించడమే ఈ పతనానికి ప్రధాన కారణం.
మరోవైపు, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం స్థిరంగా, సానుకూల దృక్పథంతో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్పంగా 692 పాయింట్లు తగ్గినప్పటికీ, వెంటనే పుంజుకుని తన స్థానాన్ని తిరిగి సంపాదించుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 80,845 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్ సింధూర్' నిర్వహించింది. ఈ సైనిక చర్య నేపథ్యంలో పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, భారత మార్కెట్లు మాత్రం ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడటం గమనార్హం.
దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లపై విశ్వాసం చూపడం వంటి అంశాలు ఈ స్థిరత్వానికి దోహదపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే మార్కెట్లపై ప్రభావం ఉండవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
