చరిత్రలో పాక్ మర్చిపోలేని కాళరాత్రి.. ‘మే 8’
తన పరిమితుల్ని మర్చిపోయి.. తనను తాను ఓ పెద్ద సూపర్ పవర్ గా ఫీలయ్యే పాకిస్తాన్.. ఉగ్రవాదులు చెప్పిన డైరెక్షన్ లో నడిచి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్న పరిస్థితి.
By: Tupaki Desk | 9 May 2025 9:13 AM ISTకదిలించుకొని మరీ కొట్టించుకునే మూర్ఖత్వం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇలాంటి తప్పులు వ్యక్తులు చేయొచ్చు కానీ ఏ దేశం చేయకూడదు. కానీ.. ఆ దారుణ తప్పును చేసేసింది పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్.. ఆ తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోలేదు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత అయినా.. తన తీరును మార్చుకోలేదు. తన పరిమితుల్ని మర్చిపోయి.. తనను తాను ఓ పెద్ద సూపర్ పవర్ గా ఫీలయ్యే పాకిస్తాన్.. ఉగ్రవాదులు చెప్పిన డైరెక్షన్ లో నడిచి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్న పరిస్థితి.
గురువారం రాత్రి భారత్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్.. రాజస్థాన్.. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి డ్రోన్ దాడులు..వైమానిక దాడులకు తెగబడటం ద్వారా.. లక్షణ రేఖను పూర్తిగా దాటేసింది. పాక్ కుయుక్తులకు చెక్ పెట్టేందుకు పక్కాగా సిద్దమైన భారత్.. ఎక్కడికక్కడ తమపై జరిగే దాడులకు తగిన రీతిలో బుద్ది చెప్పటమే కాదు.. వారి ప్రయత్నాల్ని నిలువరించింది.
అదే సమయంలో.. పాక్ దాడుల్ని తిప్పి కొట్టటమే కాదు.. పాక్ ను అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమానికి తెర తీసింది. కాళరాత్రి అన్న మాటకు అర్థం ఎలా ఉంటుందన్న విషయాన్ని పాక్ కు అర్థమయ్యే రీతిలో భారత సైన్యం.. చేతల్లో చేసి చూపించింది. కయ్యానికి కాలుదువ్వి మరీ కాళరాత్రిని కొని తెచ్చుకున్న పాకిస్తాన్.. మరెప్పుడూ మర్చిపోలేని రోజుగా మే 8 నిలుస్తుందని చెప్పాలి. ఓవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్సు.. మరోవైపు నావికాదళం చేపట్టిన చర్యలకు పాకిస్తాన్ చిగురుటాకు మాదిరి వణికిపోయిన పరిస్థితి. పాక్ లోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి చోటు చేసుకోవటమే కాదు.. చివరకు పాక్ ప్రధానిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన దుస్థితి.
మరోవైపు కరాచీ నౌకాశ్రయంలో భారీ విధ్వంసమే చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. భారత్ గగనతనంలోకి చొచ్చుకొచ్చిన యుద్ధ విమానాలకు సంబంధించి.. ఒక యుద్ధ పైలెట్ ను అదుపులోకి తీసుకోవటం ద్వారా.. పాక్ దుర్మార్గాల్ని ప్రపంచానికి చాటి చెప్పే చక్కటి అవకాశంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు పాక్ లో నెలకొన్నట్లుగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పాక్ పతనమైతే.. అందుకు ‘మే 8’ కారణంగా మారుతుందని చెప్పక తప్పదు.