48 గంటల నాన్ స్టాప్ దాడులకు పాక్ ప్లాన్
48 గంటల పాటు నాన్ స్టాప్ గా దాడులు చేసి భారత్ ను ఒడించాలని పాకిస్తాన్ భావించిన విషయాన్ని సీడీఎస్ (ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు.
By: Tupaki Desk | 4 Jun 2025 9:45 AM ISTదాయాది పాకిస్తాన్ వేసే దుర్మార్గమైన ప్లాన్లు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఆర్మీ ప్రముఖుడు ఒకరు ఓపెన్ గా షేర్ చేసిన విషయం చూస్తే షాక్ తినాల్సిందే. భారత్ మీద తనకున్న కోపాన్ని.. క్రోధాన్ని తీర్చుకోవటానికి ఎన్ని దెబ్బలు తిన్నా.. తన ప్రజలను పణంగా పెట్టేందుకు సైతం వెనుకాడదన్న నిజం మరోసారి నిరూపితమైంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ మీద భారీ విధ్వంసానికి పెద్ద ఎత్తున ప్లాన చేసింది.
48 గంటల పాటు నాన్ స్టాప్ గా దాడులు చేసి భారత్ ను ఒడించాలని పాకిస్తాన్ భావించిన విషయాన్ని సీడీఎస్ (ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఎలా చూడాలి? నష్టాన్ని ఏ ప్రాతిపదికన పరిగణలోకి తీసుకోవాలన్న అంశాలపై ఆయన సూటిగా.. స్పష్టంగా మాట్లాడారు.
యుద్ధంలో జరిగిన చిన్న చిన్న తప్పిదాల కంటే అంతిమంగా ఏం సాధించామన్నదే చాలా ముఖ్యమన్న ఆయన.. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో కొన్ని యుద్ధ విమానాల్నికోల్పోయిన విషయానికి సంబంధించి నేను చేసిన ప్రకటనను కొందరు తప్పు పడుతున్నారు. కానీ.. ఇది సరికాదు. ఇలాంటి చిన్నపాటి నష్టాలకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. ఫలితాన్నే పరిగణలోకి తీసుకోవాలి. జరిగిన నష్టం గురించి.. అంకెల గురించి మాట్లాడుకోవటం సరైంది కాదు. శత్రువు పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉందన్నదే కీలకం’’ అని పేర్కొన్నారు.
48 గంటలు నాన్ స్టాప్ గా దాడులు చేసిన భారత్ ను ఓడించాలని పాకిస్తాన్ ప్రణాలికను సిద్ధం చేసిందని.. అయితే ఆ దేశం కేవలం ఎనిమిది గంటల్లోనే చేతులెత్తేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ దాడులకు తట్టుకోలేకపోయినట్లుగా చెప్పారు. ‘‘మన దాడులకు తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది. ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగితే చావుదెబ్బ తప్పదన్న సంగతి పాకిస్తాన్ కు తెలిసిపోయింది. కాల్పుల విరమణ.. చర్చల ప్రతిపాదన తొలుత పాక్ నుంచే వచ్చింది. ఆపరేషన్ సిందూర్ లో పాక్ పైన నిర్ణయాత్మక విజయం సాధించాం. పాక్ కు ఇన్నింగ్స డిఫీట్ మిగిలింది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదన్న ఆయన.. పాకిస్తాన్ తో ఘర్షణ తాత్కాలికంగా ఆగినట్లుగా వెల్లడించారు.