పాక్ బరితెగిస్తే ప్రపంచ పటంలో ఉండదంతే !
పాక్ ప్రగల్బాలు అన్నీ ఒక్క దెబ్బతో మటాష్ అయ్యాయి. అన్ని విధాలుగా చితికిపోయి కుదేలు అయిన పాక్ భారత్ మీద దాడులు చేస్తామని చెప్పడం కంటే విడ్డూరం ఉండదు.
By: Tupaki Desk | 8 May 2025 12:00 AM ISTపాక్ ప్రగల్బాలు అన్నీ ఒక్క దెబ్బతో మటాష్ అయ్యాయి. అన్ని విధాలుగా చితికిపోయి కుదేలు అయిన పాక్ భారత్ మీద దాడులు చేస్తామని చెప్పడం కంటే విడ్డూరం ఉండదు. పాక్ సైన్యం నైతిక స్థైర్యం లేదు. ఉగ్ర మూకలనే నమ్ముకుని ప్రచ్చన్న యుద్ధం చేస్తూ దొంగ దెబ్బ తీస్తూ ఆనందించే పాక్ భారత్ మీద ప్రతి దాడులు అని మాటలు కోటలు దాటిస్తోంది.
పైగా నివాస ప్రాంతాలను కొన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఆ దేశ రక్షణ మంత్రి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన నాలుక మడతేసి మా దేశం మీద భారత్ ఆపరెషన్ ఆపితే మేము కూడా ఏ యుద్ధానికి సిద్ధం కామని తగ్గి మాట్లాడారు ఇలా ఎందుకు అంటే పాక్ ఇపుడు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండడమే.
పైగా భారత్ చేసిన దాడులు ఆ దేశం మీద కాదు, ఆ దేశంలోని ఉగ్ర మూకల మీద వారి శిబిరాల మీద. మరి వారికి మద్దతుగా పాక్ ఉంటూ యుద్ధానికి సిద్ధం అయితే భారత్ ఈసారి చేసే యుద్ధం కానీ ప్రతి చర్య కానీ పాక్ సహా ఎవరూ కలలో సైతం ఊహించని తీరుగా ఉంటాయన్నది వాస్తవం.
పాక్ బరితెగింది అణు ఆయుధాలను వాడాలని చూసిన రోజునే ఆ దేశం ఈ ప్రపంచం పటం మీద అదృశ్యం కావడం ఖాయమని అంటున్నారు భారత్ పూర్వం మాదిరి కాదు ఆ వైపు నుంచి ఒకటి ఇస్తే ఈ వైపు నుంచి పది ఇస్తూ గట్టి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. అందుకే పాక్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇక ఉగ్ర మూకలకు మద్దతుగా ఉండాలని అనుకున్నా పచ్చన్న యుద్ధం చేస్తూ భారత్ ని కెలకాలని చూసినా కూడా పాక్ పప్పులేవీ ఉడకవు అన్నది గుర్తు పెట్టుకోవాలి.
మళ్ళీ గతం మాదిరిగా పాక్ ఉగ్రవాదులను ముందు పెట్టి నాటకాలు ఆడితే ఈసారి ఆ దేశం చెల్లించబోయే భారీ మూల్యం ఏకంగా దేశంగా తనను తాను బలి పెట్టుకోవడమే. ఆ సరదా పాక్ కి తీరాలని ఉంటేనే బరి తెగించాల్సి ఉంటుంది. తనకు డ్రాగన్ మద్దతు ఉందనో లేక టర్కీ దన్ను ఉందనో భ్రమించి బరిలోకి దిగాలనుకుంటే పాక్ కి పట్టాల్సిన గతి పట్టించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుంది అన్నది వాస్తవం.
అందువల్ల పాక్ తీరు మార్చుకుంటేనే ఒక దేశంగా నిలుస్తుంది మనగలుగుతుంది. అయితే పాక్ లో అధికారం ఎవరిది అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. పాక్ ని సైన్యం శాసిస్తోంది. అలాగే అక్కడ ఉగ్రమూకలకు దర్జాగా సైన్యం మద్దతు ఉంది. అంటే పాక్ పాలకులు కేవలం బొమ్మలుగా ఉన్నారన్న మాట.
ఇక సామాన్య ప్రజల తీరు చూస్తే ఆకలితో అలమటిస్తున్నారు. పేదరికంతో అవస్థలు పడుతున్నారు. వారి మేలు కోసం పాక్ ప్రభుత్వ అధినేతలు ఏమి చేశారంటే నిరాశే మిగులుతుంది. ఆ దేశం చేసే అప్పులతో సుఖవిలాసాలు పొందేది పాలకులు సైనికులు ఉగ్రమూకలే అని అంటున్నారు.
మరి ఇంతలా దేశాన్ని దివాళా పట్టించి ప్రజల విషయంలో ఏ మాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యమే తమ విధానంగా చేసుకున్న పాక్ ప్రభువుల మీద ఆ దేశంలోని ప్రజలకు కూడా ఆగ్రహం ఉంది. పాక్ ప్రస్తుతం ఆ విధమైన అంతర సమస్యలతో సతమతమవుతోంది అయినా కానీ భారత్ మీదనే తన చూపు పెట్టి పగ సాధించాలని అనుకుంటే మాత్రం పాక్ తన వినాశనాన్ని కోరి తెచ్చుకున్నట్లే. మరో వైపు చూస్తే భారత్ చేసిన ఆపరేషన్ సిధూర్ అన్నది కేవలం ట్రయల్ మాత్రమే అన్నది మరచిపోరాదు సుదీర్ఘమైన ప్రణాళికలతో వ్యూహాలతో భారత్ ముందుకు సాగుతోంది.
భారత్ ని ఏ విధంగా కవ్వించినా తనకే తీవ్ర నష్టమమని పాక్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది అని అంటున్నారు. అలా కాదూ కూడదని తెగిస్తే మాత్రం భారత్ ప్రతి చర్యలకు పాక్ ఏ విధంగానూ తట్టుకోలేదనే అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ దాడులు పాక్ లోని ఉగ్ర మూకలకు వారిని చేయి పట్టి నడిపిస్తున్న ఆ దేశ పెద్దలకు ఆర్మీకి ఒక గుణపాఠంగా మారాలి. లేకపోతే మాత్రం వారే దేనికైనా బాధ్యులు అవుతారు అని అంటున్నారు.
