'ప్రాణాలు కాపాడుకొండ్రోయ్'...పాక్ ఆర్మీ పరిస్థితిపై కీలక రేడియో చాట్!
ఈ సమయంలో భారత్ క్షిపణుల దెబ్బకు పాక్ లోని 11 ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి.
By: Tupaki Desk | 24 May 2025 10:32 AM ISTప్రగల్భాలు పలకమంటే ఆ విషయంలో మమల్ని కొట్టేవాళ్లు లేరని చెప్పినట్లుగా ఉంటుంది పాక్ ఆర్మీ పెద్దల పరిస్థితి! తమను అడ్డుకునేవారు లేరు.. తమను ఆపేవారూ లేరు.. తాము తలచుకుంటే సింధు నదిలో నీరు కాదు నెత్తురు ప్రవహిస్తుంది.. వంటి కబుర్లు చెప్పడంలో వారికి వారే సాటి, వారితో లేవరికీ పోటీ అన్నట్లుగా ఉంటుంది! అయితే.. ప్రాక్టికల్ గా వారి పెర్ఫార్మెన్స్ అందుకు పూర్తి భిన్నమనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది!
అవును... ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ, వారిని భారత్ పైకి ఉసిగొల్పి రాక్షసానందం పొందే పాకిస్థాన్ కు.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం "ఆపరేషన్ సిందూర్"తో షాకిచ్చింది భారత్. ఇందులో భాగంగా.. పాక్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను తుదముట్టించడంతో పాటు ఆ దేశ సైనిక పోస్టులు, ఎయిర్ బేస్ లనూ ధ్వంసం చేసింది. ఈ దెబ్బతో పాకిస్థాన్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకుండాపోయిన పరిస్థితి నెలకొంది!
ఈ సమయంలో భారత్ క్షిపణుల దెబ్బకు పాక్ లోని 11 ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి. అందులో కొన్నింటి పరిస్థితి ఐసీయూలో ఉందని, అవి ఎప్పుడు తేరుకుంటాయో చెప్పలేమని అంటున్నారు! ఆ సమయంలో.. భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్ సైన్యంలో కమాండర్ స్థాయి అధికారులు సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టినట్లు, మసీదుల్లో దాక్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది!
ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పీఓకే లోని ముజఫరాబాద్ సమీపంలో ఉన్న 75వ ఇన్ ఫాంట్రీ బ్రీగేడ్ కమాండర్ ఆ పోస్ట్ ను వదిలి పారిపోయినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో.. సదరు కమాండర్ గురించి ఓ అధికారి మాట్లాడిన రేడియో చాట్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఆ కథనం పేర్కొంది!
ఆ రేడియో చాట్ లో... "చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా కమాండర్ సాబ్ ఇక్కడ నుంచి పరారయ్యాడు.. పారిపోయి వెళ్లి మసీదులో తలదాచుకుని ప్రార్థనలు చేసుకున్నాడు.. ఆ సమయంలో, పోస్టులో కార్యకలాపాలు పునరుద్దరించాలా అని అడిగితే.. ముందు మీ ప్రాణాలు కాపాడుకోంది.. ఆఫీసు తర్వాత తాపీగా తెరుచుకోవచ్చు అని సమాధానమిచ్చాడు" అని సదరు జూనియర్ అధికారి పేర్కొన్నాడు!
కాగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ "ఆపరేషన్ సిందూర్" చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ.. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సమయంలో ఆ 9 ఉగ్రశిబిరాల్లో.. ముజఫరాబాద్ లోని సైద్నా బిలాల్, షవాయ్ నల్లాహ్ అనే రెండు శిబిరాలు ఉన్నాయి. ఇది పీవోకే సరిహద్దుకు సుమారు 30 కి.మీ. దూరంలో ఉన్నాయి!
ఆ సమీపంలోని 75వ ఇన్ ఫాంట్రీ బ్రీగేడ్ కమాండర్ పోస్ట్ లోనే తాజా ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ముజఫరాబాద్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఆర్మీ విరుచుకుపడుతుంటే.. ఆ దెబ్బకు పాక్ ఆర్మీ ఇలా "ప్రాణాలు కాపాడుకొండ్రో.." అంటూ పారిపోయినట్లు రేడియో చాట్ లో వెల్లడైంది!
