Begin typing your search above and press return to search.

పాక్ చీప్ ట్రిక్స్ పై ఇండియన్ ఆర్మీ కీలక విషయాలు..!

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేసేలా వందల కొద్దీ డ్రోన్లను పాకిస్థాన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 May 2025 5:32 PM IST
పాక్ చీప్ ట్రిక్స్ పై ఇండియన్ ఆర్మీ కీలక విషయాలు..!
X

పాకిస్థాన్ ఏ విషయంలోనూ భారత్ తో సరితూగదని.. అసలు కాస్తైనా సారూప్యత లేదని అంటారు.. ఈ విషయాన్ని పాక్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిరూపిస్తూనే ఉంటుంది! ఈ క్రమంలో తాజాగా ఆపరేషన్ సిందూర్ వేళ భారత్ పై ప్రయోగించిన డ్రోన్లకు సంబంధించిన ఓ "చీప్" ట్రిక్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ ఈ విషయాలు వెల్లడించింది.

అవును... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేసేలా వందల కొద్దీ డ్రోన్లను పాకిస్థాన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ వద్ద అన్ని వేళ డ్రోన్లు ఉన్నాయా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే.. అందులో కొన్ని చాలా చీప్ వి అని, కొన్నింటికి కనీసం కెమెరా కూడా లేదని భారత ఆర్మీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ సందర్భంగా.. భారత్ పైకి ప్రయోగించిన డ్రోన్లలో పలు నిఘా, సాయుధ డ్రోన్లు ఉన్నాయని.. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి, వ్యవస్థలో లోపాలు అంచనావేయడానికి, సైనిక సామాగ్రిని మ్యాపింగ్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ పనికి పూనుకుందని.. అత్యంత చౌకబారు డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలపైకి పంపిందని చెబుతున్నారు.

ఇలా చౌకబారు డ్రోన్లను వందల సంఖ్యలో భారత్ పైకి ప్రయోగించిన నేపథ్యంలో... అసలు వీటిని ఎక్కడినుంచి కొనుగోలు చేశారో తెలుసుకొనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారని తెలుస్తోంది. వీటి శకలాలను భారత రక్షణ దళాలు సేకరిస్తుండగా.. వాటిలో కొన్ని అస్సలు చెక్కు చెదరలేదని.. అందులో చాలా వరకూ అత్యంత చీప్ వని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇండియన్ ఆర్మీకి చెందిన ఎయిర్ డిఫెన్స్ విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సుమెర్ డికున్హా... ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ సుమారు 800 నుంచి 1000 వరకూ డ్రోన్లు వాడిందని.. వీటిలో చాలావాటిని ఇండియన్ ఎయిర్ గన్స్, సిస్టమ్స్ ధ్వంసం చేశాయని.. వందల సంఖ్యలో వీటి శకలాలు ఆర్మీకి లభ్యమయ్యాయని అన్నారు.

కాగా... ఇప్పటికే పాకిస్థాన్ వాడిన చీప్ డ్రోన్స్ పై కాంగ్రెస్ పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఈ విషయాలపై మాట్లాడిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివా.. ఘర్షణ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు.. చైనా తయారు చేసినవని.. వాటి ధర ఒక్కొక్కటీ రూ.15వేలు మాత్రమే అని తెలిపారు.

అయితే.. అలాంటి చీప్ డ్రోన్లను నేలకూల్చేందుకు కేంద్రం మాత్రం రూ.15లక్షల విలువైన క్షిపణులను ఎందుకు వినియోగించిందని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మనకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్నారు. ఆ బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు.