ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం.. పాక్ సైన్యానికి మరో యుద్ధం!
సోమవారం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి వెళ్లిన పీటీఐ సెనేటర్ అలీ జాఫర్.. ఎక్స్ వేదికగా తమ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్లాన్ చేస్తోందని అన్నారు.
By: Tupaki Desk | 29 May 2025 1:00 AM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ సైన్యం సతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. పాక్ కు స్వదేశంలో పెద్ద సంక్షోభం తప్పదనే చర్చ మొదలైంది.
అవును... ఆపరేషన్ సిందూర్ తో భారత్ కొట్టిన బలమైన దెబ్బ నుంచి పాకిస్థాన్ ఆర్మీ ఎప్పుడు తేరుకుంటుందో తెలియదని అంటున్న వేళ.. స్వదేశంలో ఓ భారీ సంక్షోభానికి తెర లేస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్! ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సోదరి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పాకిస్థాన్ డైలీ, ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.
సోమవారం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి వెళ్లిన పీటీఐ సెనేటర్ అలీ జాఫర్.. ఎక్స్ వేదికగా తమ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్లాన్ చేస్తోందని అన్నారు. దీనికోసం పార్టీ సిద్ధం కావాలని.. బాగా వ్యవస్థీకృతంగా ఉండాలని అన్నారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ తో చర్చించబడిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఈ దేశవ్యాప్త ఉద్యమం కూడా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా.. ఇమ్రాన్ తన జీవితాంతం జైల్లోనే గడిపినా, ఒత్తిడికి లొంగిపోనని స్పష్టం చేశారని తెలిపారు. జైల్లో సాధారణ ఖైదీలకు ఇచ్చే ప్రాథమిక హక్కులను సైతం మాజీ ప్రధానమంత్రికి నిరాకరిస్తున్నారని వెల్లడించారు. ఇదే సమయంలో.. ఇమ్రాన్ పై ఒత్తిడి పెంచే వ్యూహంగా.. ఖాన్ భార్య బుష్రా బీబీ జైలు శిక్షను అభివర్ణించారు.
పీటీఐ ఆందోళనలకు ఇదే కారణం!:
ఈ సమయంలో పీటీఐ దేశవ్యాప్తం ఆందోళనలకు ప్లాన్ చేయడం వెనుక పాకిస్థాన్ ఆర్మీ పరిస్థితి ఒక కారణం అని అంటున్నారు. వాస్తవానికి పాకిస్థాన్ కు వాస్తవ అధిపతి ఆ దేశ సైన్యమే. ఆ సైన్యం ఆపరేషన్ సిందూర్ తో భారత్ చేతిలో చతికిలపడిపోయింది. ఈ సమయంలో దాని బలహీనతలు స్పష్టంగా బయటపడిన పరిస్థితి.
ఇలా ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పాక్ కు సైనిక ఎదురుదెబ్బలు కొత్త సమస్యగా మారాయి. ఈ సమయంలో స్వదేశంలోనూ విమర్శలు రావడంతో.. ఆర్మీ చీఫ్ ను ‘ఫీల్డ్ మార్షల్’ పదవికి నియమించారు. ఇది ‘సెల్ఫ్ ప్రమోషన్’ అనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం మునీర్ కు ప్రజాదరణ క్షీణిస్తోందని అంటున్నారు.
మరోపక్క ఇప్పటికే పాలన సన్నగిళ్లిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోలే అటు ఇస్లామాబాద్, ఇటు రావల్పిండి.. రెండింటిపైనా ఒకే సారి ఒత్తిడి తెచ్చేలా పీటీఐ తన దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించాలని చూస్తోంది. దీంతో.. ఇది పాక్ సైన్యానికి మరో యుద్ధంతో సమానం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
