ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఆపరేషన్ సిందూర్ వేళ మోడీ మార్క్!
పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేయటం.. ఆ ఆపరేషన్ విజయవంతంగా ముగిసే వరకు మోడీ ప్రత్యక్షంగా అన్ని విభాగాలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 7 May 2025 9:34 AM ISTపహల్గాం ఉగ్రదాడులపై స్పందించిన ప్రధానమంత్రి మోడీ.. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టమని.. వారు మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తామని చెప్పటం తెలుసు. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటల వేళలో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లుగా చెబుతున్నారు.
పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేయటం.. ఆ ఆపరేషన్ విజయవంతంగా ముగిసే వరకు మోడీ ప్రత్యక్షంగా అన్ని విభాగాలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై తాము చేసిన మెరుపుదాడులకు సంబంధించిన సమాచారాన్ని భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లుగా అమెరికా.. రష్యా.. యూకే.. సౌదీ అరేబియా.. యూఏఈకి సమాచారం అందించారు.
ఆపరేషన్ సిందూర్ పై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు.. ఆర్థిక.. సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసిన భారత్.. అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ మాట్లాడారు. ఇదిలా ఉండగా.. మెరుపు దాడుల అనంతరం పాక్ సైన్యం భారత్ సరిహద్దుల్లో కాల్పుల తీవ్రతను పెంచింది. దీనికి బదులుగా భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సరిహద్దు నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులు మరణించినట్లుగా వెల్లడైంది. అమాయక ప్రజల్ని పాక్ బలి తీసుకుందన్న భారత సైన్యం.. అందుకు బదులు తీర్చుకుంటామని స్పష్టం చేసింది.
