జైషే చీఫ్ మసూద్ అజార్ కు మరో దెబ్బ... ఎవరీ అబ్దుల్ రవూఫ్ అజార్?
ఇందులో భాగంగా... అతని కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మృతి చెందినట్లు జైషే మహ్మద్ చీఫ్ ప్రకటించాడు.
By: Tupaki Desk | 8 May 2025 3:34 PM ISTపాకిస్థాన్ లోని బహవల్పూర్ లో ఆపరేషన్ సిందూర్ కింద భారత్ చేపట్టిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ మృతి చెందాడనే విషయం తెరపైకి వచ్చింది. జైషే మహ్మద్ సంస్థకు సెకండ్ ఇన్ కమాండ్ అయిన రవూఫ్ అజార్ పాకిస్థాన్ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మసూద్ అజార్ కు ఊహించని దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అతని కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మృతి చెందినట్లు జైషే మహ్మద్ చీఫ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా.. జైషే మహ్మద్ సీనియర్ కమాండర్, 1999లో ఐసీ-814 విమానం హైజాకింగ్ వెనుక ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ రవూఫ్ అజార్ మరణించాడని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడం, అమలు చేయడంలో అస్గర్ చాలా కాలంగా కీలక పాత్ర పోషించాడు.
ఇదే సమయంలో... 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడిలోనూ అతను కీలక సమన్వయకర్తగా ఉన్నాడు. అదేవిధంగా 2016 పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి కూడా ఇతడు నాయకత్వం వహించాడని చెబుతున్నారు. ఇక పుల్వామా దాడిలోను అతడు కీలక భూమిక పోషించాడని భద్రతా బలగాలు నమ్ముతాయి!
కాగా... జైషే మహ్మద్ కు కీలకమైన స్థావరం బహవల్పూర్.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా చెబుతారు. ఇందులో భాగంగానే... జైషే మహ్మద్ జామియా మసీద్ ఉన్న సుభాన్ అల్లా కాంప్లెక్స్ పై భారత్ క్షిపణులు దాడి చేశాయి. స్థానికంగా దీన్ని ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని పిలుస్తారు.
ఇది గరిష్టంగా దెబ్బతిందనే విషయాన్ని పలు దృశ్యాలు కన్ఫాం చేశాయి. ఈ దాడిలోనే అబ్దుల్ రవూఫ్ అజార్ తీవ్రంగా గాయపడ్డాడని.. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని స్థానిక మీడియా నివేదించింది!
