Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్ వేళ భారత్ కు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

భారత్ కు సుదీర్ఘ కాల మిత్రుడిగా వ్యవహరిస్తున్న రష్యా సైతం తాజా పరిణామాల్లో బలమైన గొంతును వినిపించలేదు కానీ.. తన మద్దతు ఉంటుందన్న సంకేతాన్ని పంపింది.

By:  Tupaki Desk   |   13 May 2025 6:22 AM
ఆపరేషన్ సిందూర్ వేళ భారత్ కు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
X

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కొన్ని కీలక ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. భారత్ మీద ఉగ్రదాడికి దన్నుగా ఉండే పాకిస్తాన్ కు మిత్రుడిగా ఉండేందుకు ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు వచ్చాయి ఆ జాబితాలో తుర్కియా (టర్కీ), అజర్‌బైజాన్, చైనా దేశాలు నిలిచాయి. చైనా మొదట్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించినా..కీలక సమయంలో మాత్రం తమ పూర్తి మద్దతు పాకిస్తాన్ కే అన్న విషయాన్ని స్పష్టం చేశాయి. మరి.. భారత్ విషయానికి వస్తే.. తాజా ఉద్రిక్తల వేళ ఓపెన్ గా తన మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్ మాత్రమే. నేపాల్.. భూటాన్... శ్రీలంక.. మాల్దీవులు లాంటి దేశాలు తమ మద్దతును తెలిపినప్పటికీ అవి చాలా చిన్న దేశాలు కావటం.. వాటి బలం పరిమితంగా ఉండటంతో వారి మిత్రత్వాన్ని చాలామంది గుర్తించలేని పరిస్థితి.





భారత్ కు సుదీర్ఘ కాల మిత్రుడిగా వ్యవహరిస్తున్న రష్యా సైతం తాజా పరిణామాల్లో బలమైన గొంతును వినిపించలేదు కానీ.. తన మద్దతు ఉంటుందన్న సంకేతాన్ని పంపింది. కొద్ది కాలంగా ఉక్రెయిన్ తో ఆ దేశానికి నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో భారత్ లోని పరిస్థితుల్లో తాను అండగా ఉంటానన్న మాట చెప్పటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ మాటకు వస్తే.. ఇప్పుడు ఆ దేశం అర్జెంట్ గా ఉక్రెయిన్ తో లెక్కలు తేల్చుకోవటానికే అధిక ప్రాదాన్యత ఇస్తారన్నది మర్చిపోకూడదు.





భారత్ - పాక్ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో బలమైన మిత్రులను గుర్తించటం.. మారితో మనకున్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. పాక్ విషయంలోనే మనకు ఏర్పడిన ఇబ్బందుల్ని చూసినప్పుడు.. ప్రమాదకర శత్రువైన చైనాతో తేడా వచ్చినప్పుడు భారత శక్తి సామర్థ్యాలు మాత్రమే కాదు.. మిత్రుల అండ చాలా అవసరం ఉంది ఇలాంటి వేళ.. భారత్ తన సహజ మిత్రుల్ని గుర్తించటం.. వారితో బలమైన స్నేహబంధానని బలోపేతం చేసుకునేలా ప్రణాళికల్ని సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అదే సమయంలో భారత్ కు మంచి మిత్రుడి హోదాలో ఉండే అగ్రరాజ్యం అమెరికాను ఆ లిస్టులో నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. అమెరికా ప్రయోజనాలకు.. అవసరాలను తీర్చే వరకు మాత్రమే ఆ దేశానికి భారత్ తో పని ఉంటుంది. ఆ దేశానికి భావోద్వగ బంధం కంటే కూడా వాణిజ్య అవసరాలకే పెద్దపీట వేస్తుందన్నది వాస్తవం. ఇలాంటి వేళలో.. భారత్ కు మంచి స్నేహితులుగా ఎవరున్నారు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికినప్పుడు కొన్ని దేశాలు కనిపిస్తాయి. అవన్నీ భారత్ తో స్నేహ పూర్వకంగా ఉండటమే కాదు.. భారత్ తో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవటానికి ఆసక్తిని చూపుతాయన్నది మర్చిపోకూడదు.





భారతదేశానికి నిజమైన మిత్రదేశంగా గుర్తించేందుకు కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యమైనది భారత ప్రయోజనాలకు మద్దతు ఇవ్వటం.. అంతర్జాతీయ వేదికలపై భారత్ కు బాసటగా నిలిచే ధైర్యాన్ని ప్రదర్శించం.. ఆర్థిక.. సాంకేతిక.. రక్షణ.. లాంటి కీలక అంశాల్లో సహకరించే సత్తా ఉండటం..భారత్ పట్ల సామరస్యాన్ని ప్రదర్శించటం.. భారత వ్యతిరేక శక్తుల విషయంలో భారత్ కు అండగా నిలిచే దేశాల్ని ఎంపిక చేసుకోవాల్సిన అవససరం ఉంది. ఇదంతా చదివిన తర్వాత అలాంటి దేశాలు ఉన్నాయా? అన్న ప్రశ్న కలగొచ్చు. తరచి చూడాలే కానీ అలాంటి దేశాలు లేకపోలేదు.





రష్యానే తీసుకుంటే చారిత్రాత్మక మిత్రుడు.. సాంకేతికంగా మనకెంతో దన్నుగా నిలవటమే కాదు.. అప్పటికి ఇప్పటికి భారత్ కు దన్నుగా నిలిచేందుకు వెనుకాడడు. నిజానికి అమెరికా మత్తులో పడి రష్యాతో స్నేహం కాస్త తగ్గినప్పటికీ.. ఆ దేశం మాత్రం భారత్ విషయంలో ప్రత్యేక స్నేహితుడిగానే చూడటం కనిపిస్తుంది. రక్షణ పరంగా చూసినప్పుడు ఇప్పటికి ఆ దేశానికి చెందిన సాంకేతికను అత్యధికంగా మనం వాడుతున్నామన్నది మర్రచిపోకూడదు. ఇటీవల కాలంలో భారత దేశం అగ్రరాజ్యం అమెరికాకు దగ్గర అవుతున్న వేళ.. రష్యా - చైనాల మధ్య స్నేహం ముదిరి పాకాన పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి భారత్ తన తీరును కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

భారత్ కు మరో నమ్మకస్తుడైన స్నేహితుడిగా ఫ్రాన్స్ ను పరిగణించొచ్చచు. ఈ దేశంతో రఫేల్ యుద్ధ విమానాల విషయంలో కుదుర్చుకున్న డీల్.. రెండు దేశాల్ని మరింత సన్నిహితంగా మార్చిందన్నది మర్చిపోకూడదు. అంతరిక్షం.. ఆణుశక్తి.. సైనిక అంశాల్లో ఆ దేశం భారత్ దన్నుగా నిలుస్తోంది. కశ్మీర్ అంశంలో భారత్ కు మద్దతు ఇచ్చే దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అంతేకాదు.. భారత సముద్ర తీరంలో వ్యూహాత్మక మిత్రుడిగా వ్యవహరిస్తుంది.





భారత్ ఏ మాత్రం తక్కువ చూడకూడని మిత్రుల్లో జపాన్ ఒకటి. ఈ దేశం భారత్ తో సన్నిహితంగా ఉంటుంది. దీనికి కారణం చైనాతో ఆ దేశానికి ఉండే పంచాయితీనే. ఆర్థికంగా.. సాంకేతికంగా ఎంతో బలమైన ఈ దేశంతో భారత్ తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాతో చేసే వాణిజ్యంలో కొంత భాగాన్ని తగ్గించుకొని జపాన్ తో చేయటం ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలంగా మారుతుందన్నది మర్చిపోకూడదు. ఈ దేశం బాహాటంగా తన మద్దతు ఇవ్వదు. కానీ.. భారత్ విశ్వసించే దేశాల్లో ఒకటిగా నిలిచే మిత్రదేశమని చెప్పొచ్చు.





మరి.. అమెరికా సంగతి ఏమిటి? అన్నది ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అమెరికాతో మనకున్న బంధాన్ని మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ కారణంగా పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. దీర్ఘకాల ప్రయోజనాల్ని చూసినప్పుడు ఆ దేశంతో ఇప్పుడున్న బంధాన్ని కొనసాగించటం మంచిదే. అలా అని ఆ దేశం మీద ఎక్కువగా ఆధారపడటం భారతదేశ భవిష్యత్ ప్రయోజనాలకు ఎలాంటి మేలు చేయదు.

అమెరికాతో ఇప్పుడున్న బంధాన్ని కొనసాగిస్తూనే.. ఆ దేశంతో భావోద్వేగ బంధం కంటే వాణిజ్య అవసరాల కోణంలోనే చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో అమెరికా అవసరాలకు ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తన మాట వినకుంటే ఇబ్బందులు తప్పవన్న బెదిరింపు మాటలు భారత్ ను ఉద్దేశించి చేసేందుకు జంకేలా మనం మారాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఆపరేషన్ సిందూర్.. భారత భవిష్యత్తుకు కొత్త లక్ష్యాల్ని నిర్దేశించేలా చేసిందని మాత్రం చెప్పక తప్పదు. చివరగా.. మిత్రుల మధ్య స్నేహంలో అవసరాలు.. ప్రయోజనాలు తక్కువగా ఉండొచ్చు. కానీ.. దేశాల మధ్య బంధాలు బలోపేతానికి మాత్రం అవసరాలు.. పరస్పర ప్రయోజనాలే కీలకమన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.