Begin typing your search above and press return to search.

బాలాకోట్ + సర్జికల్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్

తెల్లారేసరికి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద మూకల స్థావరాల మీదకు దాడి చేసి వారి సంగతి చూసింది.

By:  Tupaki Desk   |   7 May 2025 5:00 PM IST
బాలాకోట్ + సర్జికల్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్
X

బుధవారం ఉదయం నిద్ర లేచినోళ్లు.. మొబైల్ చూసుకున్నంతనే ఒక్క దెబ్బకు నిద్రమత్తు వదిలేలా చేసింది ఆపరేషన్ సిందూర్. ఇప్పటివరకు దాయాదిపై భారత్ చేసిన దాడులకు ఈ దాడి భిన్నమైనది. పాకిస్థాన్ ఎన్ని కవ్వింపులకు పాల్పడినా.. ఎంతటి దుర్మార్గాల్ని చేసినా భరించినప్పటికి.. భారత్ సహనానికి తరచూ పరీక్షలు పెట్టే దాయాదికి దిమ్మ తిరిగే దెబ్బ తీసేందుకు మోడీ సర్కారు సిద్ధమైంది. ఓవైపు యుద్ధవేళకు ముందు నిర్వహించే మాక్ డ్రిల్ కు సిద్ధం కావాలంటూ పిలుపు ఇచ్చిన కేంద్రం.. తెల్లారేసరికి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద మూకల స్థావరాల మీదకు దాడి చేసి వారి సంగతి చూసింది.

ఇప్పటివరకు దాయాది మీద భారత్ తీసుకున్న చర్యలకు భిన్నమైనది ఆపరేషన్ సిందూర్. పాకిస్తాన్ మీద భారత్ చర్యలు తీసుకున్నప్పుడు అందరికి గుర్తుకు వచ్చేది బాలాకోట్ దాడులు.. సర్జికల్ స్ట్రైక్స్. ఈ రెండు వేర్వేరు అన్న విషయం చాలామందికి తెలీదు. ఎందుకంటే.. సర్జికల్ స్ట్రైక్ ను భారత్ నిర్వహించింది పాక్ అక్రమిత కశ్మీర్ లో. అంతర్జాతీయంగా ఆ ప్రాంతం భారత్ దే. కానీ.. పాక్ అక్రమించిన కారణంగా వారి అధీనంలో ఉన్నప్పటికి.. దాన్ని పాక్ బూభాగంగా భాగంగా భావించరు. అది మన ప్రాంతమే. కాకుంటే పాక్ కబ్జా చేసింది.

ఈ కారణంగా.. మన భూభాగంలోని ప్రాంతంలోని తిష్టవేసిన తీవ్రవాదుల అంతు చూసేందుకు నిర్వహించిన దాడులు కావటంతో దానిని సర్జికల్ స్ట్రైక్ గా పేర్కొనటం జరిగింది. ఇక.. బాలాకోట్ లో నిర్వహించిన దాడులు. ఇది పాక్ భూభాగంలోని ప్రాంతంలో.. మన మీద చేసిన దాడులకు ప్రతీకారంగా చేపట్టిన చర్యలు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ వద్దకు వద్దాం. తాజాగా నిర్వహించిన దాడులను చూస్తే.. మొత్తం తొమ్మిది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. ఏక కాలంలో తొమ్మిది వేర్వేరు టార్గెట్లలో నిర్వహించగా.. అందులో కొన్ని పాక్ భూభాగంలోని ప్రాంతాలు అయితే.. ఇంకొన్ని పాక్ అక్రమిత కశ్మీర్ లోని భాగాలు.

భారత్ చేపట్టిన తొమ్మిది దాడులు కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తిష్ట వేసిన భవనాలు.. ట్రైనింగ్ సెంటర్లు.. ఉగ్రమూకకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే కేంద్రాలు కావటం గమనార్హం. ఈ కారణంతోనే ఆపరేషన్ సిందూర్ ను సింఫుల్ గా చెప్పేయాలంటే బాలాకోట్ దాడులు + సర్జికల్ స్ట్రైక్స్ గా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ తరహా దాడులు భారత్ చేపట్టలేదు. పహల్గాం దుర్మార్గ ఉగ్రదాడికి ధీటైన బదులు ఇచ్చే క్రమంలో భారత్ వేసిన మొదటి అడుగుగా దీన్ని చెప్పాలి.