970 కి.మీ, 25 నిమిషాలు... ఆపరేషన్ సిందూర్ ఎందుకు ప్రత్యేకం?
పాకిస్థాన్ తన పెంపుడు ఉగ్రవాదులతో భారత్ పై అప్పుడప్పుడు దాడులు చేస్తుండటం.. ఆనాక భారత్ సైన్యం చేతిలో చెప్పు దెబ్బలు తినడం తెలిసిందే!
By: Tupaki Desk | 7 May 2025 6:08 PM ISTపాకిస్థాన్ తన పెంపుడు ఉగ్రవాదులతో భారత్ పై అప్పుడప్పుడు దాడులు చేస్తుండటం.. ఆనాక భారత్ సైన్యం చేతిలో చెప్పు దెబ్బలు తినడం తెలిసిందే! ఇందులో 2016లోని ఉరి-సర్జికల్ స్ట్రైక్, 2019 పుల్వామా ఎదురుదాడి ఉదాహరణలు. అయితే తాజాగా ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకనేది ఇప్పుడు చూద్దామ్!
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి 1:05 గంటలకు భారత దళాలు ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించాయి. దాదాపు ఆ సమయంలో ఇరు దేశాల్లోనూ మెజారిటీ ప్రజలు నిద్రలోనే ఉండి ఉంటారు. ఈ సమయంలో భారత్ విరుచుకుపడింది. ప్రధానంగా పాకిస్థాన్ – పంజాబ్ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్ ప్రత్యేకం అనడానికి అది కూడా ఒక కారణం.
వాస్తవానికి 2016లోని ఉరి దాడి అయినా, 2019లో చేపట్టిన పుల్వామా ఎదురుదాడిలో అయినా... భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్, దాని పక్కనే ఉన్న ఖైబర్ పఖ్తుంక్వాలోని శిబిరాలను దెబ్బతీసింది. అయితే ఈసారి నేరుగా పాక్ గుండెలపై కాల్చింది. ఇందులో భాగంగా... 1971 తర్వాత నేరుగా పంజాబ్ ఫ్రావిన్స్ లోని లక్ష్యాలని చేధించడం ఇదే తొలిసారి.
ఇలా పంజాబ్ లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు దాడి చేయడం కచ్చితంగా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే... భారతదేశంపై ఉగ్రవాద యుద్ధాన్ని నిర్వహిస్తున్న పాకిస్థాన్ సైనిక స్థావరాలు పంజాబ్ లో ఉన్నాయి. పాక్ సైనిక సమాఖ్య పరిపాలనా ప్రాంతం ఇస్లామాబాద్ - పంజాబ్ సరిహద్దుల్లోనే ఉంది. ఈ రెండు నగరాల మధ్య దూరం కేవలం 15 కి.మీ! అంటే.. భారత్ దాదాపు ఇస్లామాబాద్ పక్కకు వెళ్లి వచ్చేసింది.
ఈ ఆపరేషన్ లో భాగంగా కచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను భారత్ వినియోగించింది. వీటితో తొమ్మిది ఉగ్రవాద క్యాంపులను ఏకకాలంలో ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు 80 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికోసం భారత వైమానిక దళం 25 నిమిషాల్లో 970 కి.మీ. ప్రాంతాన్ని కవర్ చేసింది!
ఇలా పంజాబ్ లోకి చొచ్చుకుపోవడం, విస్తృత ప్రాంతంలోని ప్రధాన ఉగ్రవాద కార్యాలయాలను నాశనం చేయడం, అధిక సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం వంటి కారణాల వల్ల ఈ ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ లోపల భారత్ చేసిన అత్యంత ముఖ్యమైన, ప్రత్యేకమైన సైనికదాడిగా నిలిచిపోతుందని చెబుతున్నారు నిపుణులు!
