Begin typing your search above and press return to search.

పులుపు చావలేదు... మోడీ, భారత్ లకు జైషే అహ్మద్ చీఫ్ వార్నింగ్!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

By:  Tupaki Desk   |   7 May 2025 5:33 PM IST
Masood Azhar’s Defiant Letter After India’s Airstrike
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా... మంగళవారం రాత్రి ఒంటి గంట తర్వాత సుమారు 25 నిమిషాల పాటు 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించారు! ఇది ఉగ్రమూకలకు ఊహించని భారీ దెబ్బని అంటున్నారు.

ఇదే సమయంలో.. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో జైషే అహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం హతమైంది. ఇందులో భాగంగా మసూద్ అజార్ కు చెందిన బహవల్పూర్ స్థావరం నేలమట్టమవ్వగా అందులో ఉన్న 10 మంది కుటుంబ సభ్యులు, నలుగురు సేవకులు మృతి చెందినట్లు అతడే వెల్లడించాడు. ఈ నేపథ్యంలో భారత్ కు వార్నింగ్ ఇచ్చాడు!

అవును... ఆపరేషన్ సిందూర్ తో భారత్ సైన్యం పాక్ లోని ఉగ్ర శిబిరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులతో పాటు, ఆయా సంస్థలకు చెందిన కీలక నేతలు మరణించారని అంటున్నారు. ఈ సమయంలో.. ఆపరేషన్ సిందూర్ ను మసూద్ అజార్ ఖండించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపైనా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా.. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తానని మసూద్ హెచ్చరించాడు. త్వరలోనే భారత్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశాడు.

ఇదే సమయంలో.. తాజా ఘటనపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం, నిరాశ తో పాటు భయం, విచారం వంటివి లేదని ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ అజార్ వెల్లడించాడు. తాజా దాడిలో అజర్ కుటుంబంలోని 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

కాగా... జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనే సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు ఐక్యరాజ్యసమితి ప్రకటించాయి. పార్లమెంట్ అటాక్ (2001), 26/11 ముంబై దాడులు (2008), పఠాన్ కోట్ (2016), పుల్వామా దాడి (2019) తదితర దాడుల్లో అతడి హస్తం ఉంది!