Begin typing your search above and press return to search.

విదేశీ మీడియాకు అజిత్ దోవల్ సంచలన సవాల్... ఇది వేరే లెవెల్!

అవును... ఆపరేషన్ సిందూర్ భారతదేశానికి గర్వకారణమైన క్షణం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రశంసించారు.

By:  Tupaki Desk   |   11 July 2025 4:32 PM IST
విదేశీ మీడియాకు అజిత్  దోవల్  సంచలన సవాల్... ఇది వేరే లెవెల్!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాకిస్థాన్‌ చేసిన దాడుల్లో భారత్‌ కు నష్టం కలిగిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోవల్ సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా... పాక్‌ దాడుల్లో భారత్‌ కు నష్టం కలిగిందని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాలు విసిరారు.

అవును... ఆపరేషన్ సిందూర్ భారతదేశానికి గర్వకారణమైన క్షణం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రశంసించారు. ఈ సమయంలో పాక్ చేసిన దాడుల్లో భారత్ కు నష్టం జరిగిందనే విదేశీ మీడియా నివేదికలను ఆయన తోసిపుచ్చారు. భారతీయ ఆస్తుల విధ్వంసం గురించి ఒక్క చిత్రాన్ని అయినా, కనీసం పగిలిన గాజు ముక్కనైనా చూపించాలని ఆయన సవాలు చేశారు.

తాజాగా ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడిన అజిత్ ధోవల్... ఈ ఆపరేషన్ 23 నిమిషాల పాటు జరిగిందని.. సరిహద్దుల సమీపంలోనూ, సరిహద్దుకు దూరంగా పాకిస్తాన్ లోపల సరిగ్గా తొమ్మిది నిర్దేశించిన లక్ష్యాలను భారత సైన్యం ఛేదించిందని అన్నారు. దీనికోసం ఉపయోగించి స్వదేశీ పరిజ్ఞానం విషయంలోనూ తాము ఎంతో గర్వపడుతున్నామని అన్నారు.

భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌ లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు బయటకు వచ్చాయి కానీ.. భారత్‌ కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదని అజిత్ ధోవల్ వ్యాఖ్యానించారు. భారత్‌ కు చెందిన ఆయుధ స్థావరాలపైనా మన సైన్యం చిన్నగీత కూడా పడనివ్వలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే సవాల్ విసిరారు.

ఇదే సమయంలో సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్‌ క్షిపణులు పాకిస్థాన్‌ భూభాగాల లోపలి వరకూ వెళ్లి పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని చెప్పిన దోవల్... పాకిస్థాన్‌ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400తో మధ్యలోనే సమర్థమంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు.

కాగా... జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాం లో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన ఉగ్రవాద దాడిలో బైసరన్ లోయలోని 25 మంది పర్యాటకు, ఒక స్థానికుడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో... దీనికి ప్రతీకారంగా మే 7న భారత ఆపరేషన్ సిందూర్ అంటూ ప్రతీకార దాడి చేసింది. 23 నిమిషాల ఈ మెరుపుదాడితో పాక్ లోని ఉగ్రవాదులు వణికిపోయారు.

ఈ సమయంలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. వాటిలో బహావల్‌ పూర్‌ లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని లష్కరే తోయిబా కీలక స్థావరం ఉన్నాయి. ఈ దాడిలో సుమారు 100 మంది వరకూ ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు!

దీనికి ప్రతిస్పందనగా.. పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడులతో భారత్ పై ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే వాటన్నింటినీ భారతదేశ గతనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ దాడుల్లో భారత్ కు నష్టం వాటిళ్లిందంటూ విదేశీ మీడియా చేస్తోన్న ప్రచారంపై అజిత్ దోవల్ స్పందించారు. పగిలిన గాజు ముక్కైనా చూపించాలని సవాల్ విసిరారు.