ఇంటింటికీ 'సిందూరం'.. బీజేపీ కీలక నిర్ణయం
పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కీలక ఉగ్రవాద స్తావరాల ను, ఉగ్రవాదులను కూడా ఈ ఆపరేషన్ ద్వారా మట్టు బెట్టారు.
By: Tupaki Desk | 23 May 2025 9:25 AM ISTజమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో గత నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.(వీరిలో ఒకరు నేపాలి ఉన్నారు). ఈ ఘటన జరిగిన నెల రోజులు (మే 22) అయింది. ఇక, ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కీలక ఉగ్రవాద స్తావరాల ను, ఉగ్రవాదులను కూడా ఈ ఆపరేషన్ ద్వారా మట్టు బెట్టారు.
అయితే.. ఆ సమయంలో రాజకీయ పక్షాలు సహా దేశ ప్రజలు ముక్తకంఠంతో కేంద్రానికి మద్దతు ఇస్తున్న ట్టు ప్రకటించారు. కానీ.. అనూహ్యంగా రాత్రికి రాత్రి ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడం.. పాక్-భారత్ మధ్య తృతీయ పక్షం అమెరికా జోక్యం చేసుకోవడం.. వంటి రెండు కీలక పరిణామాలు కూడా వివాదంగా మారా యి. అయితే.. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రాత్రికి రాత్రి ఎందుకు ఆపరేషన్ ఆగిందని.. మధ్యలో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.
అంతేకాదు.. పార్లమెంటును ప్రత్యేకంగా కొలువుదీర్చి ఆపరేషన్ సిందూర్ అజెండాతో నాలుగు రోజుల పా టు సమావేశాలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరుతున్నారు. ఇలాంటి కీలక సందర్భంలో బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తాలూకు వేడిని ప్రజల్లో కనుమరుగు కాకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ... 'సిందూరం' పంచి పెట్టాలని.. క్షేత్రస్థాయిలో సిందూర్ ఆపరేషన్‌ను ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
గురువారం.. రాజస్థాన్‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. ఆపరేషన్ సిందూర్ విషయంపై మరో మూడు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీజేపీ అగ్రనాయకులు ఢిల్లీలో భేటీ అయి.. ఇంటింటికీ సిందూరం పంచాలని.. ఆపరేషన్ సిందూర్ తాలూకు విజయాలను ప్రత్యేక కరపత్రంగా రూపొందించి స్థానిక భాషలో ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని నిర్ణయించింది. అంతేకాదు.. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోనూ ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కటౌట్లను ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ అగ్రనాయకులు నిర్ణయించారు. దీనిపై ప్రధాని మోడీతో సంప్రదించి.. ప్రకటించనున్నట్టు బీజేపీ అగ్రనేత, ఉత్తరాది ఎంపీ చెప్పారు.