Begin typing your search above and press return to search.

మోడీకి చెప్పుకోమన్నోళ్లకు.. ఆపరేషన్ సిందూర్ తొ బదులు!

తన మెరుపు దాడులకు కాస్త ముందుగా సోషల్ మీడియాలో (ఎక్స్)లో ఒక వీడియోను పోస్టు చేసి మరీ దాడులు చేయటం భారత్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   7 May 2025 4:17 AM
మోడీకి చెప్పుకోమన్నోళ్లకు.. ఆపరేషన్ సిందూర్ తొ బదులు!
X

విచక్షణరహితంగా పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి గురించి తెలుసు. తమను వదిలేయాలని కోరినా వదలని ఉగ్రమూక.. ‘వెళ్లి మోడీకి చెప్పుకో’ అంటూ చేసిన వ్యాఖ్యలకు.. ఆపరేషన్ సిందూర్ పేరుతో తాజాగా దేశ ప్రధాని తన సమాధానాన్ని చెప్పేశారు. పహల్గాం ఉగ్రదాడికి రెండు వారాల తర్వాత.. పాక్ అక్రమిత కశ్మీర్ తో పాటు.. పాక్ లోని ఉగ్రస్థావరాల్ని టార్గెట్ చేసిన భారత సైన్యం తగినరీతిలో బదులు చెప్పిందని చెప్పాలి.

ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరును యావత్ భారతాన్ని కనెక్టు చేసేలా ఉండటం విశేషం. తాము చేసే పని మొత్తాన్ని పేరుతోనే చెప్పేసిన ఆపరేషన్ ఇదే అవుతుందేమో. పాక్ ఉగ్రస్థావరాల్ని నేలమట్టం చేసే ఆపరేషన్ కు పెట్టిన ఆపరేషన్ సిందూర్ బలమైన సందేశాన్ని ఇస్తుందని చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యాల్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత చర్య ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అన్నింటికంటే సాహసోపేతమైన చర్య ఏమంటే.. తన మెరుపు దాడులకు కాస్త ముందుగా సోషల్ మీడియాలో (ఎక్స్)లో ఒక వీడియోను పోస్టు చేసి మరీ దాడులు చేయటం భారత్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.

ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేద తీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవటం.. తాము టార్గెట్ చేసిన వారిలో పురుషుల్ని.. మహిళల్ని వేరు చేయటం.. వారి మతం అడిగి మరీ.. భార్య కళ్ల ముందే భర్తను కిరాతకంగా అంతమొందించటం.. వదిలేయాలని కోరితే ‘‘వెళ్లి.. మోడీకి చెప్పుకో’’ అంటూ చేసిన వ్యాఖ్యలు భారతదేశ జనుల గుండెల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చేలా చేశాయి.

ఉగ్రమూక టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి కేవలం ఆరు రోజుల ముందే పెళ్లి చేసుకున్న వధూవరుల జంట ఉండటం తెలిసిందే. నేవీ అధికారి అయిన వినయ్ నర్వాల్.. హిమాన్షిలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. వినయ్ ను హత్య చేశారు. అతడి డెడ్ బాడీ వద్ద గుండెలు అవిసేలా రోదిస్తున్న హిమాన్షి ఫోటో యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సిందూర్ పేరును చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థంలోనూ దీన్ని చూడొచ్చు. కశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా.. జేషే మహమ్మద్.. హిజ్జుల్ ముజాహిదదీన్ సంస్థలకు చెందిన కీలక క్యాంపుల్ని తాజా ఆపరేషన్ లో నేలమట్టం చేశారని చెప్పాలి.