మలేసియాలో పారని పాక్ పాచిక.. అంతర్జాతీయంగా ఒంటరైన దాయాది దేశం
కానీ మలేషియా ఈ వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భారత ఎంపీల బృందం తమ దేశంలో కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతించింది.
By: Tupaki Desk | 4 Jun 2025 8:30 PM ISTపాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం, 'ఆపరేషన్ సిందూర్' గురించి వివిధ దేశాలకు వివరించడానికి భారత పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ వేసిన ఎత్తుగడలు చాలా చోట్ల బెడిసికొడుతున్నాయి. తాజాగా, జనతాదళ్ (యు) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష బృందం మలేషియాలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలను రద్దు చేయాలన్న పాకిస్తాన్ విజ్ఞప్తిని మలేషియా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
భారత బృందం మలేషియాలో పాల్గొనాల్సిన పది కార్యక్రమాలను రద్దు చేయాలని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ 'మతం' అంశాన్ని తెరపైకి తెచ్చింది. " భారత ప్రతినిధుల మాటలు వినవద్దు. ఆ దేశ బృందం కార్యక్రమాలను రద్దు చేయండి" అని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, కశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఉందని, ఇది కొన్ని దేశాలను భారత్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నించేలా చేసిందని పాకిస్తాన్ వాదించింది.
కానీ మలేషియా ఈ వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భారత ఎంపీల బృందం తమ దేశంలో కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతించింది. దీంతో భారత ఎంపీల బృందం పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం గురించి మలేషియా ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసింది. భారత్ తీసుకుంటున్న చర్యలను కూడా వివరించింది. సంజయ్ ఝా ఈ సమావేశాల దృశ్యాలను 'ఎక్స్'లో (X Platform) పంచుకున్నారు.
మలేషియాతో పాటు, భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనల ద్వారా పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి, ఉగ్రవాదంపై భారతదేశం కఠిన వైఖరిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దౌత్యపరమైన చర్యలు భారతదేశానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.