ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్‌కు ఆర్థిక సాయం.. భారత్ వద్దన్న వినని ఏబీడీ
తాజాగా, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) పాకిస్తాన్‌కు భారీ సహాయాన్ని ప్రకటించింది. ADB 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,700 కోట్లు) ఆర్థిక సహాయం (Financial Assistance) అందించడానికి అంగీకరించింది.
By: Tupaki Desk | 4 Jun 2025 9:06 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ నుంచి టర్కీ, చైనా, అజర్‌బైజాన్ వంటి దేశాల నుంచి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన డ్రోన్‌లు, క్షిపణులు, ఆయుధాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా, భారత్ పాకిస్తాన్‌లోని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 కీలక ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి, వాటిని నేలమట్టం చేసింది. ఈ దాడులలో 200 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సైనికపరంగానే కాకుండా వివిధ ఆర్థిక కఠిన చర్యల కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. భారత్, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, రెండు దేశాల మధ్య వీసాలను (Visas) రద్దు చేయడం వంటి అనేక కఠిన చర్యలు తీసుకుంది. తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్, IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి), ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సహాయం పొందుతోంది. ప్రపంచ బ్యాంక్, IMF ఇప్పటికే పాకిస్తాన్‌కు వందల కోట్ల సహాయాన్ని అందించాయి. భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించినా, ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.
తాజాగా, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) పాకిస్తాన్‌కు భారీ సహాయాన్ని ప్రకటించింది. ADB 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,700 కోట్లు) ఆర్థిక సహాయం (Financial Assistance) అందించడానికి అంగీకరించింది. దీనితో భారత్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ వంటి దేశాలకు సహాయం చేయడం భవిష్యత్తులో ముప్పును కొని తెచ్చుకోవడమే అని అంతర్జాతీయ మీడియా ముందు స్పష్టం చేసింది. అయితే, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇవేవీ పట్టించుకోకుండా పాకిస్తాన్‌కు భారీ సహాయాన్ని ప్రకటించింది.
పాకిస్తాన్‌కు 800 మిలియన్ డాలర్ల సహాయం అవసరమని ఆ దేశం కోరగా, ADB ఆ అభ్యర్థనను ఆమోదించింది. ఆర్థిక సహాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ హెచ్చరికలను పట్టించుకోకుండా అంతర్జాతీయ సంస్థలు ఈ విధంగా పాకిస్తాన్‌కు సహాయం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్‌లో GDPలో పన్ను వసూళ్లు కొంతకాలంగా తగ్గుముఖం పట్టాయని భారత్ స్పష్టం చేసింది. 2025 నాటికి పన్ను వసూళ్లు 13 శాతం నుంచి 9.2 శాతానికి పడిపోయాయని పేర్కొంది. మరోవైపు, పాకిస్తాన్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని భారత్ వివరించింది. అంతర్జాతీయ సంస్థలు అందించే ఆర్థిక సహాయంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను మరింత ప్రోత్సహిస్తోందని భారత్ స్పష్టం చేసింది.