ఆపరేషన్ సిందూర్ పై అంతర్జాతీయ మీడియా ఆసక్తికర స్పందన!
పహల్గాం ఉగ్రదాడి భారత్, పాక్ లలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 7 May 2025 7:00 PM ISTపహల్గాం ఉగ్రదాడి భారత్, పాక్ లలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో తాజాగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై అటు ప్రపంచ దేశాల అధినేతలతో పాటు ఇటు అంతర్జాతీయ మీడియా ఆసక్తికరంగా స్పందించింది.. విస్తృత కవరేజ్ ఇచ్చింది.
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మంగళవారం అర్ధరాత్రి 1:05 నిమిషాలకు పాక్ లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం అవ్వగా.. సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని అంటున్నారు.
ఈ సమయంలో ఈ ఆపరేషన్ కు అంతర్జాతీయ మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది. ఇందులో భాగంగా... పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు వారాల తర్వాత పాక్ పై భారత్ దాడి చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొనగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ వైమానిక దాడులు చేసిందని సీ.ఎన్.ఎన్. పేర్కొంది.
ఇదే సమయంలో... పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ క్షిపణులను ప్రయోగించిందని.. దీన్ని పాకిస్థాన్ యుద్ధ చర్యగా పేర్కొందని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొనగా.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిందంటూ బీబీసీ కథనం ప్రచురించింది. కశ్మీర్ లో ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ వైమానిక దాడులు చేపట్టిందని రాయిటర్స్ తెలిపింది.
కాగా... పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ప్రపంచ దేశాల అధినేతలు స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ దాడులు త్వరగా ముసిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు శక్తివంతమైన దేశాలు ఇలా రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని అన్నారు.
ఇదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడిపై ఇజ్రాయేల్ స్పందించింది. ఇందులో భాగంగా... ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది.. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి.. ఈ విషయంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ప్రకటించారు.
