పాక్ యుద్ధం ప్రకటించింది... భారత్ బ్రీఫింగ్ లో కీలక వ్యాఖ్యలు!
ఆపరేషన్ సిందూర్ పై తాజాగా భారత విదేశాంగ, రక్షణ శాఖలు సంయుక్తంగా బ్రీఫింగ్ ఇచ్చాయి.
By: Tupaki Desk | 10 May 2025 12:21 PM ISTఆపరేషన్ సిందూర్ పై తాజాగా భారత విదేశాంగ, రక్షణ శాఖలు సంయుక్తంగా బ్రీఫింగ్ ఇచ్చాయి. ఈ సమయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి తాజా బ్రీఫింగ్ కు మరోసారి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పాక్ చేసిన పనులు, భారత్ ఇచ్చిన సమాధానాలపై క్లారిటీ ఇచ్చారు.
అవును... పాకిస్థాన్ శుక్రవారం రాత్రి 26 ప్రాంతాల్లో ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడిందని.. ముఖ్యంగా శ్రీనగర్, అవంతీపురా మొదలైన ప్రాంతాల్లో వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించిందని.. అయితే ఆ ప్రయత్నాలను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.
ఇదే సమయలో పాక్ చర్యలకు భారత సైన్యం గట్టిగా జవాబు ఇస్తుందని.. మరోవైపు పాకిస్థాన్ ఎయిర్ బేస్ లపైనా భారత్ ప్రతిదాడులు చేసిందని తెలిపిన సోఫియా ఖురేషి... భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందని అన్నారు. మరోవైపు.. భారత్ బాలిస్టిక్ క్షిపణులను వాడుతోందని, ఎస్-400 ను ధ్వంసం చేశామని పాక్ ఫేక్ ప్రచారం చేసిందని ఆమె పేర్కొన్నారు.
అదేవిధంగా... పాకిస్థాన్ దుర్మార్గపు చర్యలు ఆగడం లేదని.. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతోందని.. పాకిస్థాన్ ఫైటర్ జెట్లు పదే పదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయని.. పంజాబ్ లోని పలు కీలక ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకున్నాయని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.
అయితే... మానవత్వం మరిచి శ్రీనగర్ లోని స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా పాకిస్థాన్ దాడులకు తెగబడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... పాక్ చర్యలు అత్యంత హేయమైనవని.. సైనిక స్థావరాలే కాకుండా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చెసుకోవడం వారి దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
అసలు విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో దాడులు చేయడం వారి మానవత్వం లేని చర్యలకు నిదర్శనమని.. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత రక్షణ వ్యవథను దెబ్బతీయాలని పాకిస్థాన్ కుట్ర చేస్తోందని వింగ్ కమాండర్ వ్యోమికసింగ్ వివరించారు.
అనంతరం విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ స్పందించారు. పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీపై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని అన్నారు. భారత్ లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందని.. మరోవైపు తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని అన్నారు.
జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందని.. మానవత్వం మరిచి ప్రవర్తిస్తుందని అన్నారు. మరోవైపు భారత ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసినట్లు అసత్య ప్రచారం చేస్తొందని.. ఆర్మీ బేస్ లకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. అయితే.. జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ మరణం దురదృష్టకరమని తెలిపారు.
ఏది ఏమైనా... పాకిస్థాన్ తాజా ప్రకటన ప్రకారం భారత్ పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిందని.. "ఆపరేషన్ బన్ యన్ ఉల్ మర్సూస్" పేరుతో ఈ దాడులు కొనసాగుతున్నాయని ప్రకటించారు.
