ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ పాపులారిటీ... ఏ స్థాయిలో అంటే..?
పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ కు, ఆ దేశంలో దాక్కొన్న ఉగ్రవాదులకు బుద్ది చెప్పాలన్నట్లుగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2025 11:00 PM ISTపహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ కు, ఆ దేశంలో దాక్కొన్న ఉగ్రవాదులకు బుద్ది చెప్పాలన్నట్లుగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ పాకిస్థాన్ కూడా సైనిక చర్యకు ఉప్రకమించింది. ఈ సమయంలో పాక్ డ్రోన్లు, క్షిపణులను భారత్ విజయవంతంగా నిర్వీర్యం చేసింది.
దీంతో... పాకిస్థాన్ వాడిన డ్రోన్లు, క్షిపణులు గరిష్టంగా మేడిన్ చైనావి కావడంతో.. ఆ దేశపు ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఒక క్లారిటీ వచ్చిందని.. చైనా ఆయుధాలకు బేరాలు తగ్గాయని అంటున్నారు. మరోపక్క.. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, అక్కడున పలు కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది భారత్.
ఇలా పాక్ నుంచి వస్తోన్న డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా నిర్వీర్యం చేయడంలో ఎస్-400 పూర్తిగా సక్సెస్ అయ్యిందనే పేరు బలంగా వినిపించడంతో పాటు.. పాక్ లో కీలక ప్రాంతాలు, ఉగ్రస్థావరాలు, పాక్ వైమానిక స్థావరాలపై భారత్ సక్సెస్ ఫుల్ గా దాడి చేయడంలో బ్రహ్మోస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. దీంతో వీటి డిమాండ్ బాగా పెరిగిందని అంటున్నారు.
అవును... బ్రహ్మోస్ అనేది ఒక క్షిపణి మాత్రమే కాదు.. భారత సైనిక బలానికి శక్తివంతమైన ప్రతీక అని.. ఇది కేవలం ఒక ఆయుధం కాదు.. శత్రుదేశాలకు ఇదొక సందేశం అని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ లోని సైనిక స్థావరాలు, ఉగ్రశిబిరాలపై కచ్చితమైన దాడులకు ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను వాడినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... తాజాగా స్పందించిన అమెరికా మాజీ సైనికాధికారి, యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్... బ్రహ్మోస్ క్షిపణుల ముందు పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలు కూలిపోయాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లోని ఏ ప్రాంతంపై అయినా, ఎప్పుడైనా దాడి చేయగల స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా తెలియజేసిందని అన్నారు.
ఈ నేపథ్యంలో ఓ పక్క చైనా ఆయుధాలలోని నిస్సత్తువ బయటపడటంతో పాటు.. భారత క్షిపణుల బలం ఆపరేషన్ సిందూర్ తో బయటకు వెల్లడి కావడంతో.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ పేరు మారుమ్రోగిపోతుందని అంటున్నారు. ఇలా ఆపరేషన్ సిందూర్ లో నిర్ణయాత్మక పాత్ర తర్వాత ప్రపంచదేశాలు బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... వియత్నాం, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా, యూఏఈ సహా సుమారు 17కి పైగా దేశాలు ఇప్పుడు బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడం కోసం క్యూలో ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఫిలిప్పీన్స్ మాత్రమే ధృవీకరించబడిన ఒప్పందాన్ని కలిగి ఉండగా.. మిగిలిన దేశాలు వరుసలో ఉన్నాయని.. ఇప్పుడు ప్రపంచ రక్షణ మార్కెట్ లో బ్రహ్మోస్ అగ్ర ఎంపికగా ఉందని చెబుతున్నారు.
