పాక్ ప్రధానిని 2:30కి నిద్రలేపిన ఆర్మీ చీఫ్.. ఇంట్రస్టింగ్ వీడియో!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ ను వణికించేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2025 9:29 AM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ ను వణికించేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో పాక్ లోని ఉగ్రవాదులతో పాటు ఆ దేశ ప్రభుత్వం గడగడలాడిందని అంటున్నారు. ఈ సమయంలో నాడు తమ టెన్షన్ ఏ స్థాయిలో ఉందో చెబుతూ.. భారత్ దాడిలో కీలకమైన ఎయిర్ బేస్ లు ఎలా ధ్వంసమయ్యాయో పాక్ ప్రధాని తాజాగా వెల్లడించారు!
అవును... మే 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తమ కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన ఖచ్చితమైన దాడులను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. ఈ సమయంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. శుక్రవారం పాకిస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన షరీఫ్.. ఈ విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా.. మే 9 - 10 తేదీల్లో భారత్ ఆపరేషన్ దాడులు ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాత తెల్లవారుజామున 2:30 గంటలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి, దాడుల గురించి తెలియజేశారని.. రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందని చెప్పారని.. అది తీవ్ర ఆందోళన కలిగించిన క్షణమని షరీఫ్ అన్నారు.
దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేషనల్ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్ లో షేర్ చేస్తూ... ఈ సంఘటన ఆపరేషన్ సిందూర్ ధైర్యం, సామర్థ్యానికి నిదర్శనమని అభివర్ణించారు.
వాస్తవానికి పంజాబ్ లోని అడంపూర్ ఎయిర్ బేస్ లోని ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను తమ జేఎఫ్-17 ఫైటర్ జెట్ లు ధ్వంసం చేశాయని పాకిస్థాన్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే... ఇటీవల భారత్ ప్రధాని మోడీ.. ఆ బేస్ ను సందర్శించారు.. ఫోటోలు పోస్ట్ చేశారు. ఫలితంగా.. పాకిస్థాన్ తప్పుడు ప్రచారాన్ని తనదైన శైలిలో బద్దలు కొట్టారు.
ఇదే సమయంలో... భారతదేశం తన పౌరులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించగా.. సింద్ ప్రావిన్స్ సీఎం భోలారి వైమానిక స్థావరంపై దాడి జరిగిందని, ఆరుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మరణించారని చెప్పడంతో.. పౌరులను కాదు, సైనిక స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందనే వాదనకు మద్దతు లభించింది.
అయితే... తాజాగా పాక్ ప్రధాని నిజం ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా... భారత క్షిపణులు.. మన కీలక మైన వైమానికి స్థావరాలను ధ్వంసం చేశాయని పాక్ ప్రధాని అంగీకరించారు. భారత క్షిపణుల దెబ్బ తమకు బలంగా తగిలిందని ఒప్పుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
