తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్!
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పలు విమానాశ్రయాలు మూసివేయబడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jun 2025 1:06 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భీకర యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీంతో.. ఆ ప్రాంతంలోని విమానాశ్రయాలన్నీ మూసివేశారు. ఫలితంగా... గగనతలంలో పౌరవిమానాలు కనుమరుగయ్యాయి. ఈ సమయంలో భారత్ కు ఇరాన్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అందుకు భారత్.. థాంక్స్ చెప్పింది.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పలు విమానాశ్రయాలు మూసివేయబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. దీంతో వేల మంది విదేశీయులు ఇరాన్ లో చిక్కుకుపోయారని అంటున్నారు. ఇదే సమయంలో వేల మంది భారతీయులు ఇరాన్ లో ఇరుక్కుపోయారు!
ఈ నేపథ్యంలో ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... భారతీయుల తరలింపు విమానాల కోసం ప్రత్యేకంగా గగనతలాన్ని తెరవాలని నిర్ణయించింది. దీంతో... ఇరాన్ నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఈ రోజు విమానంలో తరలించనున్నట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ సింధు' అని నామకరణం చేసిన ఈ కార్యక్రమం ద్వారా 1000 మంది విద్యార్థులను తీసుకురానున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో... మొదటి విమానం ఈ రోజు రాత్రి భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరనుందని.. మిగిలిన రెండు విమానాలు శనివారం ల్యాండ్ కానున్నాయని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి... విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు భారతదేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. భారతీయ పౌరులు తమ భూభాగాల గుండా సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పించినందుకు ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుందని తెలిపారు.
మరోవైపు... పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ విద్యార్థులను కూడా ఆ ప్రాంతం నుంచి తరలించాలని నేపాల్, శ్రీలంక దేశాలు భారత్ ను కోరాయి. దీంతో ఆయా దేశాల పౌరులను ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా విమానాల్లో తరలించాలని నిర్ణయించింది. టెహ్రాన్ లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది.
