Begin typing your search above and press return to search.

భారత్ కోసం ఏకంగా ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసిన ఇరాన్

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చాలా అంతర్జాతీయ విమానాలు ఆ దేశ గగనతలాన్ని దాటడానికి నిషేధించబడ్డాయి

By:  Tupaki Desk   |   20 Jun 2025 11:59 PM IST
భారత్ కోసం ఏకంగా ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసిన ఇరాన్
X

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చాలా అంతర్జాతీయ విమానాలు ఆ దేశ గగనతలాన్ని దాటడానికి నిషేధించబడ్డాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్ కోసం ప్రత్యేకంగా ఆ దేశ గగనతలాన్ని ఓపెన్ చేసింది ఇరాన్. అక్కడ చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధు' ప్రక్రియలో భాగంగా ఇరాన్ ఈ ప్రత్యేక అనుమతిని ఇచ్చింది.

ఇరాన్ లోని వివిధ నగరాల్లో చిక్కుకున్న 1000 మంది భారత విద్యార్థులను ఢిల్లీలోకి తరలించేందుకు ఈ సదుపాయం కల్పించారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు తొలి విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయనుంది. ఇంకా రెండు విమానాలు శనివారం ప్రణాళికలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ చేయనున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు పెరిగిపోతుండటంతో ఇరాన్ తమ గగనతలాన్ని అంతర్జాతీయ విమానాలకు మూసివేసింది. కానీ భారత్‌కు మాత్రం ప్రత్యేక కారిడార్‌ను అందుబాటులో ఉంచింది. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే అవకాశం దక్కింది.

"విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు మేం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తాం. భారత పౌరుల రక్షణ కోసం సహకరించిన ఇరాన్, ఆర్మేనియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు" అని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి వెల్లడించారు.

ప్రస్తుతం ఇరాన్‌లో 10,000 కంటే ఎక్కువ భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారి అందరి భద్రత కోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ ప్రత్యేక అనుమతితో భారతీయుల తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రమాదభరితమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను త్వరితగతిన రప్పించేందుకు భారత్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.